IND vs NED: టీమిండియా విజయానికి 4 కారణాలు ఇవే.. కీలకంగా మారిన ఆ రెండు విషయాలు..
ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని రంగాల్లో రాణించింది. దీంతో భారీ విజయం దక్కింది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం లభించలేదు. పవర్-ప్లేలో 38 పరుగులు మాత్రమే వచ్చాయి.
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. గురువారం సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై భారత్ 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు గ్రూప్-2లో భారత జట్టు 4 పాయింట్లతో మొదటి స్థానానికి చేరుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని రంగాల్లో రాణించింది. దీంతో భారీ విజయం దక్కింది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం లభించలేదు. పవర్-ప్లేలో 38 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత సులువుగా గెలుపొందేందుకు నాలుగు అంశాలు కీలకంగా పనిచేశాయి. ఇలానే టీమిండియా ముందుక సాగితే.. టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ సొంతమవుతుందని మాజీలు అంటున్నారు. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
4. నెదర్లాండ్స్ అనుభవ రాహిత్యం..
ఈ ప్రపంచకప్‌లో భారత బ్యాటింగ్ లైనప్ టోర్నీలో అత్యంత శక్తిమంతమైనదని చెబుతున్నారు. ఇదిలావుండగా, తొలి 10 ఓవర్ల వరకు భారత బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా ఆడలేకపోయారు. సగం ఇన్నింగ్స్ ముగిసేసరికి టీమ్ ఇండియా స్కోరు 67/1గా నిలిచింది. భారీ మ్యాచ్‌లు ఆడేందుకు నెదర్లాండ్స్‌కు అనుభవం లేకపోవడం ఆ జట్టును దెబ్బతీసింది. ఇంతకుముందు నెదర్లాండ్స్ టీమ్ ఇండియాతో ఏ టీ20 మ్యాచ్ ఆడలేదు. నెదర్లాండ్స్ ఇప్పటివరకు 12 టెస్టు ఆడే దేశాలతో 36 టీ20 ఇంటర్నేషనల్స్ మాత్రమే ఆడింది. ఇందులో 21 మ్యాచ్‌లు ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే వంటి తేలికపాటి జట్లపైనే ఉన్నాయి.
మొత్తం 20 ఓవర్లలో భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. దీని కారణంగా జట్టు చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయగలిగింది. చివరి 10 ఓవర్లలో భారత్ దాదాపు 11 రన్ రేట్ వద్ద పరుగులు సాధించింది.
3. వరుసగా రెండు కీలక భాగస్వామ్యాలు..
భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. 12 బంతుల్లో 9 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కానీ, ఆ తర్వాత భారత్ నుంచి వరుసగా రెండు మంచి భాగస్వామ్యాలు వచ్చాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రెండో వికెట్‌కు 56 బంతుల్లో 73 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యంతో టీమిండియా తన పట్టును బిగించింది. ఆ తర్వాత విరాట్, సూర్యకుమార్ యాదవ్ జోడీ కూడా 48 బంతుల్లో 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఈ రెండు కీలక భాగస్వామ్యాలు టీమిండియా విజయానికి, భారీ స్కోర్ చేసేందుకు దోహదం చేశాయి.
2. కోహ్లి క్లాస్, సూర్య మాస్ ఇన్నింగ్స్..
12వ ఓవర్ చివరి బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. స్కోరు రెండు వికెట్లకు 84 పరుగులు మాత్రమే. పిచ్ నిదానంగా ఉండటంతో స్ట్రోక్ ప్లే అంత సులువుగా లేదు. బ్యాట్స్‌మెన్ భయాందోళనకు గురై ఉంటే, ఇక్కడ నుంచి పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఉంది, కానీ, ఇక్కడ నుంచి విరాట్ క్లాస్, సూర్య మాస్ ఇన్నింగ్స్‌తో పరుగుల వేగాన్ని పెంచేశారు. విరాట్ ఒక ఎండ్ నుంచి వికెట్ పడకుండా చూసుకున్నాడు. అదే సమయంలో సూర్య జట్టు రన్ రేట్ పెంచే పనిలో పడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ 140 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయగా, సూర్య 204 స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేశాడు.
1. భువీ ఓపెనింగ్ స్పెల్ అదుర్స్..
భారత్ 179 పరుగుల స్కోరు చేసింది. కానీ, ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో ఇది సగటు స్కోర్‌గానే భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నెదర్లాండ్స్‌ను భారత బౌలర్లు కట్టడి చేసేందుకు నడుం బిగించారు. ఈ బాధ్యతను స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తీసుకున్నాడు. అతను తన మొదటి రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. దీని ప్రభావంతో డచ్ బ్యాట్స్‌మెన్ భయాందోళనకు గురై షాట్లు ఆడే క్రమంలో ఒకరి తర్వాత ఒకరు వికెట్లు కోల్పోతూ.. ఓటమిపాలయ్యారు.