IND v AUS : హిట్‌మ్యాన్, అయ్యర్ పోరాటం వృథా.. 265 లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్.. మ్యాథ్యూ షార్ట్, కొనోలి మెరుపులు
అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో కూడా భారత్ ఓటమి పాలైంది. దీంతో ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 264 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆస్ట్రేలియా విజయంలో బార్ట్‌లెట్, జంపా వంటి బౌలర్లు, ఆ తర్వాత మ్యాథ్యూ షార్ట్, కూపర్ కొనోలి వంటి బ్యాటర్లు కీలక పాత్ర పోషించారు.

IND v AUS : ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు మరోసారి నిరాశ ఎదురైంది. పెర్త్ వన్డేలో ఓటమి తర్వాత, అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో కూడా భారత్ ఓటమి పాలైంది. దీంతో ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 264 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆస్ట్రేలియా విజయంలో బార్ట్‌లెట్, జంపా వంటి బౌలర్లు, ఆ తర్వాత మ్యాథ్యూ షార్ట్, కూపర్ కొనోలి వంటి బ్యాటర్లు కీలక పాత్ర పోషించారు. ఈ విజయం ఆస్ట్రేలియాకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే, అడిలైడ్‌లో 17 ఏళ్ల తర్వాత భారత్‌పై ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి.
పెర్త్ తరహాలోనే ఆడిలైడ్ లోనూ టీమిండియా టాస్ ఓడిపోవడంతో ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టుకు ఓపెనింగ్ పేలవంగా దక్కింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా, విరాట్ కోహ్లీ ఖాతా కూడా తెరవకుండానే వెనుతిరిగాడు. కోహ్లీ తన కెరీర్‌లో వరుసగా రెండు వన్డే మ్యాచ్‌లలో సున్నా పరుగులకే అవుట్ కావడం ఇదే తొలిసారి.
ఆ తర్వాత రోహిత్ శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61) మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. చివర్లో అక్షర్ పటేల్ 44 పరుగులు చేయడంతో, భారత్ ఎలాగోలా 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు, యువ పేసర్ జేవియర్ బార్ట్‌లెట్ 3 వికెట్లు పడగొట్టారు. 265 పరుగుల లక్ష్యం ఆస్ట్రేలియాకు తేలికైంది. ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్ 11 పరుగులకే వెనుతిరిగినా, మ్యాథ్యూ షార్ట్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.
మ్యాథ్యూ షార్ట్ 78 బంతుల్లో 74 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ట్రావిస్ హెడ్ (28), మ్యాథ్యూ రెన్‌షా (30) పర్వాలేదనిపించారు. అలెక్స్ క్యారీ (9) అవుట్ అయినప్పుడు భారత్ తిరిగి మ్యాచ్‌లోకి వస్తుందనిపించినా, యువ ఆటగాడు కూపర్ కొనోలి అజేయంగా హాఫ్ సెంచరీతో, మిచెల్ ఓవెన్ 23 బంతుల్లో 36 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకోవడమే కాకుండా, అడిలైడ్‌లో భారత్‌ను 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓడించినట్లయింది.
వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడంతో భారత జట్టు వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఆఖరిదైన మూడో వన్డే మ్యాచ్ అక్టోబర్ 25న సిడ్నీలో జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన టీమ్ ఇండియా ముందు ఇప్పుడున్న లక్ష్యం సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ కాకుండా ఆపడమే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




