AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Squad : సంజూ శాంసన్‌పై వేటు.. జింబాబ్వే సిరీస్‌కు టీమిండియా ప్రకటన

India Squad : జింబాబ్వే టీ20 సిరీస్‌కు బీసీసీఐ యువ జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. ఇషాన్ కిషన్ రీఎంట్రీ ఇవ్వగా, పలువురు యువ ఆటగాళ్లకు తొలిసారి టీమిండియా తరఫున అవకాశం లభించింది.

India Squad : సంజూ శాంసన్‌పై వేటు.. జింబాబ్వే సిరీస్‌కు టీమిండియా ప్రకటన
India Vs Zimbabwe
Rakesh
|

Updated on: Jul 06, 2026 | 8:06 PM

Share

India Squad : బీసీసీఐ జింబాబ్వే పర్యటనకు వెళ్లే 15 మంది సభ్యులతో కూడిన సరికొత్త టీమిండియా జట్టును అధికారికంగా ప్రకటించింది. జూలై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సెలెక్టర్లు యంగ్ బ్లడ్‎ను నమ్ముకున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సీనియర్ ఆటగాళ్లలో చాలా మందికి ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఈ యువ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, యువ ఆల్‌రౌండర్ తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. ఈ సిరీస్ ద్వారా భవిష్యత్తు టీ20 జట్టును నిర్మించడమే లక్ష్యంగా బీసీసీఐ అడుగులు వేస్తోంది.

ఈ జట్టు ప్రకటనలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేరు ఈ స్క్వాడ్‌లో లేకపోవడం. గత కొన్ని ఇన్నింగ్స్‌లుగా వరుసగా విఫలమవుతూ వస్తున్న సంజూపై సెలెక్టర్లు వేటు వేశారు. అతనితో పాటు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్లను కూడా ఈ పర్యటనకు ఎంపిక చేయలేదు. సంజూ శాంసన్ స్థానంలో ఇషాన్ కిషన్ తిరిగి వికెట్ కీపర్‌గా జట్టులోకి రాగా, బ్యాకప్ కీపర్‌గా ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు మళ్లీ పిలుపు వచ్చింది. 2023 ఆసియా క్రీడల తర్వాత ప్రభ్‌సిమ్రన్ భారత జట్టులోకి రావడం ఇదే మొదటిసారి.

ఈ పర్యటన ద్వారా పలువురు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లకు భారత జట్టు తరఫున ఆడే సువర్ణ అవకాశం దక్కింది. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన యష్ ఠాకూర్, అశోక్ శర్మలు తొలిసారి భారత టీ20 జట్టుకు ఎంపికయ్యారు. అలాగే గంటకు 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేయగల టీమిండియా యువ స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి చేరాడు. 2024లో చివరిసారిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మయాంక్.. తన పేస్ పవర్‌తో జింబాబ్వే బ్యాటర్లను భయపెట్టేందుకు సిద్ధమయ్యాడు. వీరితో పాటు హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ వంటి నయా యువ ఆటగాళ్లకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది.

ఈ పర్యటనలో భాగంగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య మొత్తం మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ జింబాబ్వే రాజధాని హరారేలోని క్లబ్ మైదానంలోనే జరగడం విశేషం. జూలై 23న మొదటి టీ20 మ్యాచ్, జూలై 25న రెండో టీ20 మ్యాచ్, జూలై 26న మూడో చివరి టీ20 మ్యాచ్ జరగనున్నాయి. వరుస రోజుల్లో మ్యాచ్‌లు ఉండటంతో ఆటగాళ్ల ఫిట్‌నెస్ ఈ సిరీస్‌లో చాలా కీలకం కానుంది. సీనియర్లు లేకపోయినా అభిషేక్ శర్మ, రింకూ సింగ్, వైభవ్ సూర్యవంశీ వంటి హిట్టర్లతో కూడిన ఈ యంగ్ టీమిండియా జింబాబ్వేను వారి సొంత గడ్డపైనే చిత్తు చేస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

జింబాబ్వే సిరీస్ ప్రకటనతో పాటు ఇంగ్లాండ్‌తో త్వరలో జరగబోయే వన్డే సిరీస్ భారత జట్టులో కూడా ఒక కీలక మార్పును బీసీసీఐ ప్రకటించింది. యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తొడకండరాల గాయం కారణంగా ఇంగ్లాండ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతను ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో సెలెక్టర్లు అతని స్థానంలో స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను వన్డే జట్టులోకి రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేశారు. శివమ్ దూబే ఇటు జింబాబ్వే టీ20 సిరీస్‌తో పాటు అటు ఇంగ్లాండ్‌తో వన్డే మ్యాచ్‌ల్లోనూ భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు.

జింబాబ్వే సిరీస్‌కు భారత టీ20 స్క్వాడ్

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్).

భారత్ వర్సెస్ జింబాబ్వే టీ20 సిరీస్ మ్యాచ్‌ల షెడ్యూల్ వివరాలు

మొదటి టీ20 మ్యాచ్ :

తేదీ: 23-07-2026

వేదిక: హరారే

రెండో టీ20 మ్యాచ్ :

తేదీ: 25-07-2026

వేదిక: హరారే

మూడో టీ20 మ్యాచ్ :

తేదీ: 26-07-2026

వేదిక: హరారే

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us