Ind vs Zim, Deepak Chahar: సినిమా స్టార్లు, క్రికెటర్లకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారిని ప్రత్యక్షంగా చూడడం, ఒక ఫొటో దిగితే చాలు అనుకునేవారు చాలామందే ఉంటారు. అలాంటిది ఒక క్రికెటర్ దగ్గరికి రావడం.. భుజం మీద చేయి వేసుకుని మరీ ఫొటోలు దిగే అవకాశం కల్పిస్తే వారి ఆనందానికి అవధులే ఉండవు.. జింబాబ్వేకు చెందిన ముగ్గురు అమ్మాయిలు ప్రస్తుతం ఇలాంటి ఆనందంలోనే మునిగితేలుతున్నారు. వివరాల్లోకి వెళితే గాయం కారణంగా సుమారు ఆరునెలల పాటు జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్పీడ్ బౌలర్ దీపక్ చాహర్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. గురువారం జింబాబ్వేతో జరిగిన మొదటి వన్డేలో బరిలోకి దిగిన అతను మూడు వికెట్లతో సత్తాచాటాడు. తద్వారా తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ టీమిండియా పేస్ బౌలర్‌తో సరదాగా ఫొటోలు దిగాలని కొంతమంది అమ్మాయిలు భావించారు. దీనికి నవ్వుతూ మనస్ఫూర్తిగా ఓకే చెప్పాడు చాహర్. దీంతో అమ్మాయిలు మన స్టార్ బౌలర్ భుజంపై చేతులు వేసి ఫొటోలు దిగి ఆనంద డోలికల్లో మునిగిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.
‘చాహర్ ఎంతో అణకువతో ఉంటాడు. తనతో ఇలా ఫొటోలు దిగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలామంది మమ్మల్ని తాకడానికి ఇష్టపడరు. అతను మాత్రం ఎంతో హుందాగా ప్రవర్తించాడు. తనను తాకే అవకాశం కల్పించాడు’ అని ఈ వైరల్ వీడియోలో చెప్పకొచ్చారు ఆ లేడీ ఫ్యాన్స్. కాగా ఈ విషయంపై చాహర్ మాట్లాడుతూ ‘ దేశానికి ప్రాతినిథ్యం వహించాలన్నది నా చిన్ననాటి కల. అది ఇప్పుడు నెరవేరింది. మరి మనల్ని అభిమానించే ఫ్యాన్స్‌తో ఇలా కలిసిపోవడం కూడా గొప్పగానే ఉంటుంది కదా’ అని చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..