IND vs SL: బ్యాటింగ్‌లో ఇషాన్-శ్రేయాస్.. బౌలింగ్‌లో భువీ-వెంకటేష్‌ల దెబ్బకు లంక విలవిల.. తొలి టీ20లో టీమిండియా ఘన విజయం..!
టీ20 ప్రపంచకప్ నుంచి ఇప్పటి వరకు వరుసగా 10వ మ్యాచ్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఇప్పటికే న్యూజిలాండ్, వెస్టిండీస్‌లను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది.
రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు విజయాలతో సాగుతోంది. వెస్టిండీస్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసిన టీమిండియా, శ్రీలంకతో(India vs Sri Lanka) జరిగిన టీ20 సిరీస్‌ను కూడా విజయవంతమైన ఆరంభం చేసింది. ఫిబ్రవరి 24, గురువారం లక్నోలో శ్రీలంకతో జరిగిన మొదటి T20Iలో భారత్ 62 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో వరుసగా 10వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా(Team India) విజయం సాధించింది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో తొలి రెండు పరాజయాల తర్వాత భారత జట్టు తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆ తర్వాత న్యూజిలాండ్, వెస్టిండీస్‌పై మొత్తం 6 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది.
ప్లేయింగ్ ఎలెవన్‌లో తమ స్థానంపై ఇంకా నమ్మకం లేని టీమ్ ఇండియా ఆటగాళ్లు తమ సత్తాను చాటుకునేందుకు ఈ మ్యాచ్ వేదికగా నిలిచింది. ఈ సందర్భంలో, ఓపెనర్ ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బలమైన ప్రదర్శన చేసి సెలెక్టర్ల ముందు చిక్కు ప్రశ్నలు వేశారు. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీలతో ఇది ప్రారంభమైంది.
భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో టాస్ ఓడిపోయిన టీమ్ ఇండియా బ్యాటింగ్‌కు దిగింది. జట్టు తరపున ఓపెనింగ్ భాగస్వామ్యం విజయానికి పునాదిని సిద్ధం చేసింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఆ బాధ్యతను తీసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన పేలవమైన సిరీస్ నుంచి కోలుకున్న ఇషాన్ చెలరేగిపోయాడు. ఈ యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ కేవలం 30 బంతుల్లోనే తన రెండో T20 అర్ధశతకం సాధించాడు. రోహిత్‌తో కలిసి ఇషాన్ 111 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. ఇందులో రోహిత్ 44 పరుగులు చేశాడు.
ఇషాన్‌కు సెంచరీ చేసే అవకాశం ఉంది. కానీ, వేగంగా ఆడడంతో అప్పటికే రెండు లైఫ్‌లను పొందినా.. చివరకు తప్పించుకోలేకపోయాడు. సెంచరీకి ముందు కేవలం 11 పరుగులకే ఔటయ్యాడు. 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేశాడు.
ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ బాధ్యతలు స్వీకరించాడు. విరాట్ కోహ్లి గైర్హాజరీలో మూడో స్థానంలో నిలిచిన అయ్యర్, ఇషాన్ కిషన్ ఔట్ అయిన తర్వాత తన దాడిని మరింత పెంచాడు. కేవలం 25 బంతుల్లో నాలుగో T20I ఫిఫ్టీని సాధించాడు. అయ్యర్ చివరి 3 ఓవర్లలో 14 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టును 199 పరుగుల పటిష్ట స్కోరుకు చేర్చాడు.
పవర్‌ప్లేలో దుమ్మురేపిన భువనేశ్వర్.. శ్రేయాస్, ఇషాన్ తర్వాత బౌలర్ల వంతు వచ్చింది. అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మంచి ఆరంభాన్ని అందించాడు. భారత పేసర్ తొలి బంతికే శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిసంక వికెట్ తీశాడు. శ్రీలంక జట్టు 7వ ఓవర్ వరకు కేవలం 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇందులో భువీ ఖాతాలో రెండు వికెట్లు చేరాయి. ఈ పరాజయాల నుంచి శ్రీలంక జట్టు ఎప్పటికీ కోలుకోలేకపోయింది. టీమ్ ఇండియా మెరుగైన బౌలింగ్‌తో పాటు శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ల పేలవ షాట్‌ల కారణంగా వికెట్లు వరుసగా పతనమయ్యాయి.
చరిత్ అసలంక మాత్రమే జట్టు తరఫున ధీటుగా బ్యాటింగ్ చేయగలిగాడు. 47 బంతుల్లో 53 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. చివరి ఓవర్లలో చమిక కరుణరత్నే (21 పరుగులు, 14 బంతుల్లో), దుష్మంత చమీర (24 నాటౌట్, 14 బంతుల్లో) వేగంగా పరుగులు చేసినప్పటికీ ఇవి సరిపోకపోవడంతో 20 ఓవర్లలో శ్రీలంక జట్టు 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ తరఫున భువనేశ్వర్, వెంకటేష్ అయ్యర్ తలో 2 వికెట్లు తీయగా, యుజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.
Also Read: IND vs SL: హిట్‌మ్యాన్ @ టీ20 ఫార్మాట్ నయా కింగ్.. మూడో స్థానంలో విరాట్.. ఆ రికార్డులు ఏంటంటే?