
IND vs SA 5th T20 : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదో టీ20లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మల విధ్వంసకర బ్యాటింగ్ ధాటికి ప్రోటీస్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. భారీ లక్ష్యాన్ని ముందుంచిన భారత్, సిరీస్ కైవసం చేసుకునే దిశగా బలమైన అడుగు వేసింది.
ఓపెనర్లుగా వచ్చిన అభిషేక్ శర్మ (34), సంజూ శామ్సన్ (37) జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి రెండు ఓవర్లలోనే 25 పరుగులు రాబట్టి భారత్ దూకుడును చాటారు. అయితే మంచి ఊపులో ఉన్న అభిషేక్ 6వ ఓవర్లో అవుట్ కాగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) మరోసారి నిరాశపరిచాడు. 115 పరుగుల వద్ద సూర్య అవుట్ కావడంతో భారత్ కాస్త నెమ్మదిస్తుందేమో అనిపించింది. కానీ అక్కడి నుండి అసలైన మజా మొదలైంది.
నాలుగో వికెట్‌కు జతకట్టిన తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా సౌతాఫ్రికా బౌలర్లను ఉతికి ఆరేశారు. తిలక్ వర్మ కేవలం 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, హార్దిక్ పాండ్యా అంతకంటే వేగంగా కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది రికార్డు సృష్టించాడు. వీరిద్దరూ కలిసి కేవలం 43 బంతుల్లోనే 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖరి ఓవర్లో హార్దిక్ (25 బంతుల్లో 63) అవుట్ కాగా, తిలక్ వర్మ (71) రనౌట్ అయ్యాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో మొత్తం సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసింది.
ఈ ఇన్నింగ్స్‌లో ఒక ఆసక్తికర సంఘటన కూడా చోటుచేసుకుంది. సంజూ శాంసన్ కొట్టిన ఒక బుల్లెట్ లాంటి షాట్ నేరుగా అంపైర్ రోహన్ పండిట్‌ను తాకింది. అంపైర్ నొప్పితో విలవిలలాడటంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. సౌతాఫ్రికా ఫిజియో వచ్చి చికిత్స అందించిన తర్వాత తిరిగి ఆట ప్రారంభమైంది. ఇప్పుడు సౌతాఫ్రికా గెలవాలంటే 232 పరుగులు చేయాలి. బుమ్రా నేతృత్వంలోని భారత బౌలర్లు ఈ భారీ స్కోరును ఎలా కాపాడుకుంటారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..