Ind vs Pak : అబ్బే..ఊరికే అన్నాం బాబాయ్..పాకిస్థాన్ మళ్ళీ యూ-టర్న్ తీసుకోబోతుందా ?

Ind vs Pak : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆడుతున్న మైండ్ గేమ్ ఇప్పుడు ఆ దేశానికే చుట్టుకునేలా కనిపిస్తోంది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించి సంచలనం రేపిన పాక్, ఇప్పుడు తోక ముడిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఐసీసీ నుంచి వస్తున్న తీవ్ర హెచ్చరికలు, ఆర్థికంగా దివాళా తీసే ముప్పు పొంచి ఉండటంతో పాక్ వెనక్కి తగ్గే అవకాశం ఉందని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ బాంబు పేల్చారు. వచ్చే 24 గంటల్లో పాకిస్థాన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు.

Ind vs Pak  : అబ్బే..ఊరికే అన్నాం బాబాయ్..పాకిస్థాన్ మళ్ళీ యూ-టర్న్ తీసుకోబోతుందా ?
Pakistan Cricket

Updated on: Feb 02, 2026 | 4:04 PM

Ind vs Pak : భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ చేసిన ప్రకటన క్రికెట్ ప్రపంచంలో పెద్ద దుమారమే రేపింది. అయితే ఈ నిర్ణయం వెనుక పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహసిన్ నఖ్వీ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ దిగ్గజం రషీద్ లతీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు మాట మార్చడం అలవాటేనని, వచ్చే 24 గంటల్లోనే ఆ దేశ ప్రభుత్వం, బోర్డు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెర వెనుక భారత్, పాక్ ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతుండవచ్చని, పరిస్థితులు త్వరలోనే సద్దుమణుగుతాయని ఆయన పేర్కొన్నారు.

నిజానికి పాక్ గనుక భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే ఆ దేశ క్రికెట్ భవిష్యత్తు నామరూపాల్లేకుండా పోతుంది. ఐసీసీ ఇప్పటికే పీసీబీని తీవ్రంగా హెచ్చరించింది. భారత్‌తో మ్యాచ్ రద్దయితే బ్రాడ్‌కాస్టర్లకు వచ్చే వేల కోట్ల నష్టాన్ని పాకిస్థానే భరించాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఐసీసీ నుంచి ఏటా వచ్చే వందల కోట్ల ఆదాయం ఆగిపోతుంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు ఇది మరణశాసనమే అవుతుంది. ఈ భయం వల్లే పాక్ ఇప్పుడు వెనక్కి తగ్గేందుకు దారులు వెతుక్కుంటోంది.

పాకిస్థాన్ మొండిగా ముందుకెళ్తే జరిగే నష్టాలు సామాన్యంగా లేవు. ముందుగా ఆ దేశాన్ని ద్వైపాక్షిక సిరీస్‌ల నుంచి సస్పెండ్ చేసే ప్రమాదం ఉంది. 2028 టీ20 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులు పాక్ నుంచి చేజారిపోతాయి. ఆసియా కప్ నుంచి కూడా బహిష్కరణ తప్పదు. అన్నిటికంటే ముఖ్యంగా, విదేశీ బోర్డులు తమ ఆటగాళ్లను పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడేందుకు పంపవు. దీంతో పీఎస్ఎల్ ఒక గల్లీ క్రికెట్ టోర్నమెంట్‌లా మారిపోతుంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న పాక్ పెద్దలు, పరువు పోకముందే భారత్ తో తలపడటమే మేలని భావిస్తున్నట్లు సమాచారం.

పీసీబీ చీఫ్ మొహసిన్ నఖ్వీ ఈ డ్రామా అంతా తన రాజకీయ ఇమేజ్ పెంచుకోవడానికే చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పాకిస్థాన్ ప్రజల్లో భారత్‌కు ఎదురుతిరిగాడు అనే పేరు సంపాదించుకుని పాపులర్ అవ్వాలనేది ఆయన ప్లాన్ అని విమర్శకులు అంటున్నారు. అయితే ఐసీసీ నుంచి వస్తున్న ఒత్తిడి చూస్తుంటే, ఆయన రాజకీయ ఆటలు సాగేలా కనిపించడం లేదు. మొత్తానికి వచ్చే 24 గంటల్లో భారత్-పాక్ మ్యాచ్‌పై ఒక స్పష్టమైన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..