IND vs PAK: భారత్-పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్.. ఈ రెండు సందర్భాల్లోనే ఢీ
Asian Games 2026: భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. ఇరు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించాయి. గ్రూప్ దశలో ఢీ ఉండదు. రెండు జట్లు ఫైనల్ చేరితే గోల్డ్ మెడల్ పోరులో, సెమీస్‌లో ఓడితే బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో తలపడే అవకాశం ఉంటుంది.

IND vs PAK: ఆసియా గేమ్స్ 2026లో భారత్, పాకిస్థాన్ మధ్య హై-వోల్టేజ్ క్రికెట్ పోరుపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇరు జట్లు తలపడటానికి కేవలం రెండు అవకాశాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా ఆసియా గేమ్స్ 2026 పోటీలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ఈ క్రీడా సంబరాల్లో నాలుగోసారి క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. మహిళల క్రికెట్ టోర్నీ సెప్టెంబర్ 17 నుంచి, పురుషుల పోటీలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమవుతాయి. గతంలో హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో పురుషుల, మహిళల విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన భారత్, ఈసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. అంతర్జాతీయ హోదా కలిగిన ఈ మ్యాచ్‌లన్నీ టీ20 ఫార్మాట్‌లో జరగనున్నాయి.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు సాధ్యమవుతుంది?
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ సమరం గ్రూప్ దశలో జరగదు. పురుషుల, మహిళల విభాగాల్లో ఇరు జట్లు ఎదురెదురుపడటానికి కేవలం రెండే రెండు దారులు ఉన్నాయి. ఒకటి బంగారు పతకం (ఫైనల్) పోరు, రెండోది కాంస్య పతకం (మూడో స్థానం) కోసం జరిగే ప్లే-ఆఫ్ మ్యాచ్. అంటే భారత్, పాకిస్థాన్‌లు రెండూ ఫైనల్‌కు చేరుకోవాలి లేదా సెమీఫైనల్‌లో ఓడిపోయి కాంస్య పతక పోరులో తలపడాలి. అప్పుడు మాత్రమే ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు సాధ్యమవుతుంది.
క్వార్టర్ ఫైనల్ ఈక్వేషన్స్ ఇవే
పురుషుల విభాగంలో టాప్ సీడెడ్ జట్లుగా ఉన్న భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. మిగిలిన స్థానాల కోసం గ్రూప్-ఎ లో ఉన్న ఆఫ్ఘనిస్థాన్, జపాన్, నేపాల్, గ్రూప్-బి లో ఉన్న హాంగ్‌కాంగ్, మలేషియా, ఒమన్ జట్లు పోటీపడతాయి. ఇక మహిళల విభాగంలో హర్మాన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో జపాన్‌తో తలపడనుంది. ఇందులో గెలిస్తే సెమీస్‌లో బంగ్లాదేశ్ లేదా చైనాతో మ్యాచ్ ఉంటుంది. మరోవైపు పాకిస్థాన్ జట్టు థాయిలాండ్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
బలమైన జట్లతో బరిలోకి దిగుతున్న భారత్
ఈ టోర్నీ కోసం భారత బోర్డు అత్యంత బలమైన జట్లను ఎంపిక చేసింది. మహిళల జట్టుకు హర్మాన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. పురుషుల జట్టును శ్రేయస్ అయ్యర్ ముందుండి నడిపించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ఈ 15 మంది సభ్యుల భారత పురుషుల జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
