IND vs PAK: తెలుగబ్బాయ్ కెప్టెన్సీ అదుర్స్.. తొలి మ్యాచ్‌లో పాక్ జట్టుకు ఇచ్చి పడేసిన భారత్..

|

Oct 20, 2024 | 7:08 AM

Emerging Asia Cup 2024: ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో నిన్న రాత్రి భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఉత్కంఠ విజయం సాధించింది. తిలక్ వర్మ ఆధ్వర్యంలోని భారత జట్టు విజయంతో టోర్నీని ప్రారంభించింది.

IND vs PAK: తెలుగబ్బాయ్ కెప్టెన్సీ అదుర్స్.. తొలి మ్యాచ్‌లో పాక్ జట్టుకు ఇచ్చి పడేసిన భారత్..
Ind A Vs Pak A
Follow us on

Emerging Asia Cup 2024: ఒమన్‌లో అక్టోబర్ 18 నుంచి ప్రారంభమైన ఆసియా కప్ టోర్నమెంట్‌లో నిన్న రాత్రి హై ఓల్టేజ్ పోరు జరిగింది. బాదవైరిలో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో టీమిండియా 7 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. నిజానికి ఈ టోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. దీంతో ఇరు జట్లు విజయంతో టోర్నీని ప్రారంభించాలని కోరుకున్నాయి. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ను ఎట్టకేలకు తిలక్ వర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన పాక్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత్‌కు శుభారంభం..

మస్కట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, ప్రభాసిమ్రాన్ సింగ్‌లు అదరగొట్టారు. వీరిద్దరూ పవర్‌ప్లేలోనే 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి 5 సిక్సర్లు, 8 ఫోర్లు బాదారు. ఆ తర్వాత స్పిన్నర్లు రావడంతో భారత్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. 7వ, 8వ ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరూ ఔట్ కాగా, నెహాల్ వధేరా, ఆయుష్ బదోనీలు చెప్పుకోదగ్గ సహకారం అందించలేకపోయారు.

ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన తిలక్ వర్మ కూడా స్లోగా ఇన్నింగ్స్ ఆరంభించినా తర్వాత వేగం పుంజుకునే ప్రయత్నం చేశాడు. చివరి ఓవర్లలో రమణదీప్ సింగ్ తుఫాన్ బ్యాటింగ్‌ను ప్రదర్శించి 17 పరుగులు అందించాడు. రసిఖ్ దార్ చివరి బంతికి సిక్సర్ కొట్టి జట్టును 183 పరుగులకు చేర్చాడు. పాకిస్థాన్ తరపున స్పిన్నర్ సుఫ్యాన్ మకిమ్ 28 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

పాకిస్థాన్ జట్టుకు బ్యాడ్ స్టార్ట్..

ఈ లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్థాన్‌కు శుభారంభం లభించలేదు. రెండో బంతికే కెప్టెన్ మహ్మద్ హారీస్ ఔటయ్యాడు. అయితే యాసిర్ ఖాన్, ఖాసిం అక్రమ్‌ల విధ్వంసక భాగస్వామ్యం జట్టును మళ్లీ విజయపథంలోకి చేర్చింది. కానీ, 9వ ఓవర్ వేసిన నిశాంత్ సింధు.. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేసి పాక్ జట్టుపై ఒత్తిడి పెంచింది. అనంతరం వచ్చిన అరాఫత్ మిన్హాస్ ఎదురుదాడి చేస్తూ భారత జట్టును ఒత్తిడిలోకి నెట్టగా, మరోవైపు హైదర్ అలీ తడబడ్డాడు.

మిడిల్ ఆర్డర్ వైఫల్యం..

వీరి జోడీని బద్దలు కొట్టడంలో రసిఖ్ దార్ సక్సెస్ అయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన కొత్త బ్యాట్స్‌మెన్ అబ్దుల్ సమద్.. వచ్చిన వెంటనే బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో టీమ్ ఇండియా మళ్లీ ఒత్తిడిలో పడింది. కానీ, 17వ ఓవర్లో అరాఫత్‌ను అవుట్ చేయడం ద్వారా రసిఖ్ జట్టును విజయానికి చేరువ చేశాడు. చివరి ఓవర్లో పాకిస్థాన్ విజయానికి 17 పరుగులు చేయాల్సి ఉంది. స్ట్రయిక్‌లో ఉన్న సమద్‌ను అన్షుల్ కాంబోజ్ తన మొదటి బంతికే అవుట్ చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఈ ఓవర్‌లో అన్షుల్ 9 పరుగులు మాత్రమే ఇచ్చి జట్టుకు 7 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..