Watch Video: పాక్‌పై అంత కసి ఏంటి భయ్యా.. హార్దిక్‌ను ముద్దాడుతూ.. భారత విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఆఫ్ఘన్ ఫ్యాన్..
Hardik Pandya: ఆసియా కప్ 2022లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేశాడు. హార్దిక్ పాండ్యా సిక్సర్ కొట్టి టీమిండియాకు విజయాన్ని అందించాడు.
Hardik Pandya: ఆసియా కప్ 2022లో భారత్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ మధ్య ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు మొత్తం 147 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీమ్ ఇండియా విజయానికి స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా హీరోగా నిలిచాడు. మొదట మూడు వికెట్లు తీసి, ఆ తర్వాత 33 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా చివరి ఓవర్‌లో నాలుగో బంతికి లాంగ్ ఆన్‌లో సిక్సర్ కొట్టి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు.
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు భారత్ విజయంతో సంబరాలు చేసుకున్నారు. భారత జట్టు విజయంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్న వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఓ వీడియో మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందినది. అఫ్గానిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి టీమ్‌ఇండియా విజయంతో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. టీవీ స్క్రీన్‌పై హార్దిక్ పాండ్యాను ముద్దుపెట్టుకున్న తర్వాత గది నుంచి బయటకు వెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోంది.
Congratulations to all our brothers. Indians And Afghans????. We the people Afghanistan celebrating this victory with or friend country indian people. #India #ViratKohli? #pandya #INDvsPAK pic.twitter.com/FFI5VvKE0d
— A H (@YousafzaiAnayat) August 28, 2022
గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పరాజయానికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. గతేడాది దుబాయ్‌లోనే టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్‌లు తలపడ్డాయి. బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టును ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం ఆదివారం ఆసియా కప్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ఇక్కడ రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 5 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది.
భారత్-పాకిస్థాన్ మధ్య చాలా మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగుతుండగా ఆదివారం మరోసారి అలాంటి దృశ్యమే కనిపించింది. ఫాస్ట్ బౌలర్ల అత్యుత్తమ ప్రదర్శనతో భారత జట్టు పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసింది. ఆ తర్వాత గట్టిపోటీని ఎదుర్కొన్న భారత జట్టు ఆసియా కప్‌లో విజయాన్ని నమోదు చేసుకుంది. అత్యుత్తమ ఆల్ రౌండ్ ప్రదర్శనతో హార్దిక్ పాండ్య ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఆసియా కప్‌లో భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌ని హాంకాంగ్‌తో ఆడనుంది.