IND Vs NZ: 12 ఫోర్లు, 10 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్.. దెబ్బకు టీమిండియా బౌలర్లకు గుండెల్లో దడ!

70-2, 78-3, 89-4, 110-5, 131-6... ప్రత్యర్ధుల బ్యాటింగ్ లైనప్ ఇలా కొనసాగింది. టీమిండియా బౌలర్లు ఫుల్ జోష్‌లో ఉన్నారు..

IND Vs NZ: 12 ఫోర్లు, 10 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్.. దెబ్బకు టీమిండియా బౌలర్లకు గుండెల్లో దడ!
Michael Bracewell

Updated on: Jan 19, 2023 | 1:00 PM

70-2, 78-3, 89-4, 110-5, 131-6… ప్రత్యర్ధుల బ్యాటింగ్ లైనప్ ఇలా కొనసాగింది. టీమిండియా బౌలర్లు ఫుల్ జోష్‌లో ఉన్నారు.. డగౌట్ కూడా తమదే గెలుపు అని నిర్ణయానికి వచ్చారు. సీన్ కట్ చేస్తే.. అప్పుడొచ్చాడండీ.. ‘గాండీవధారి అర్జున’లా మైకేల్ బ్రేస్‌వల్ బరిలోకి దిగాడు. అర్ధ సెంచరీతో ఆగలేదు.. గేర్ మార్చాడు.. సెంచరీ చేశాడు.. టీమిండియా బౌలర్లను ఊచకోత కోశాడు. టార్గెట్ వరకు ఒక్కో అడుగు వేశాడు. అయితే దురదృష్టశాత్తు చివరి ఓవర్‌లో గురి మిస్ అయ్యాడు. దీంతో టీమిండియా విజయం సాధించింది. అతడు క్రీజులో ఉన్నంత వరకు భారత్ బౌలర్ల గుండెల్లో దడ పుట్టించాడు.

బుధవారం హైదరాబాద్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ మొదటి వన్డేలో తలబడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి భారత్‌ బ్యాటింగ్ చేసింది. రోహిత్ శర్మ(34) మరోసారి నిరాశపరచగా.. విరాట్ కోహ్లీ(8) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగాడు. అయితే ఓపెనర్ శుభ్‌మాన్ గిల్(208) ఒకవైపు స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ.. తన కెరీర్‌లో మొదటి డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది.

ఇక 350 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. 100 పరుగులలోపు 4 వికెట్లు పడిపోయాయి. 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే అప్పుడొచ్చాడు.. మైకేల్ బ్రేస్‌వెల్.. ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా చక్కదిద్దాడు. మరో ఎండ్‌లో శాంట్నార్(57)తో కలిసి ఆరో వికెట్‌కు 150 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరి వరకు క్రీజులో ఉండి టీమిండియా బౌలర్ల గుండెల్లో దడ పుట్టించాడు. కొండంత టార్గెట్‌ను చిన్నది చేసుకుంటూ వచ్చాడు.

మొత్తానికి 78 బంతుల్లో 140 పరుగులు చేసిన బ్రేస్‌వెల్ తన ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 10 సిక్సర్లు కొట్టాడు. చివరి ఓవర్ రెండో బంతికి పెవిలియన్ చేరాడు. తద్వారా టీమిండియా విజయం సాధించింది. ఒకవేళ ఆ 4 బంతులు బ్రేస్‌వెల్ క్రీజులో ఉంటే.. న్యూజిలాండ్ గెలుపు దాదాపు ఖాయమైనట్లేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. కాగా, బంగ్లాదేశ్ సిరీస్‌లో మెహిదీ హాసన్, శ్రీలంక సిరీస్‌లో దసున్ షనక, కివీస్‌తో మొదటి వన్డే‌లో బ్రేస్‌వెల్.. ఇలా గత రెండు సిరీస్‌ల నుంచి భారత్ బౌలర్లకు ప్రత్యర్ధి లోయర్ ఆర్డర్ బ్యాటర్లు దడ పుట్టిస్తున్నారు.