IND vs AUS: తగలరాని చోట తగిలిన బంతి.. భరించలేని నొప్పితో విలవిల్లాడిన కెప్టెన్‌ రోహిత్‌

|

Feb 18, 2023 | 7:58 AM

ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ రెండో బంతినే బౌండరీకి తరలించి తన ఉద్దేశాన్ని చాటాడు రోహిత్‌. అయితే ఆ తర్వాతి బంతిని కమిన్స్‌ స్టంప్స్‌ లైన్‌లో మెరుపు వేగంతో బౌల్‌ చేశాడు.

IND vs AUS: తగలరాని చోట తగిలిన బంతి.. భరించలేని నొప్పితో విలవిల్లాడిన కెప్టెన్‌ రోహిత్‌
Rohit Sharma
Follow us on

మొదటి టెస్టులో సాధించిన విజయోత్సాహాన్ని కొనసాగిస్తూ రెండో టెస్టూలోనూ టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు 263 పరుగులకే కుప్పకూలింది. ఉస్మాన్‌ ఖవాజా 81, హ్యాండ్స్‌ కాంబ్‌ 72, కమిన్స్‌ 33 పరుగులతో రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. షమీ 4 వికెట్లతో కంగారూల పతనాన్ని శాసించగా, అశ్విన్‌, జడేజా తలా 3 వికెట్లతో కంగారూల పని పట్టారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 9 ఓవర్లలో 21 పరుగులు చేసింది. రోహత్‌ శర్మ 13, కేఎల్‌ రాహుల్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే టీమిండియా ఇన్నింగ్స్‌ ప్రారంభంలోనే రోహిత్‌ అభిమానులను కలవరపెట్టే సంఘటన ఒకటి మ్యాచ్‌లో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ రెండో బంతినే బౌండరీకి తరలించి తన ఉద్దేశాన్ని చాటాడు రోహిత్‌. అయితే ఆ తర్వాతి బంతిని కమిన్స్‌ స్టంప్స్‌ లైన్‌లో మెరుపు వేగంతో బౌల్‌ చేశాడు. దీంతో బంతిని అంచనా వేయడంలో పొరబడ్డాడు. అది నేరుగా హిట్‌మ్యాన్‌ గార్డుకు తగిలింది. మెరుపువేగంతో బాల్‌ తగలడంతో రోహిత్‌ నొప్పితో విలవిల్లాడిపోయాడు. క్రీజు నుంచి కాస్త పక్కకు వెళ్లి కాసేపు కింద కూర్చున్నాడు. మళ్లీ తిరిగి లేచి బ్యాటింగ్‌ కొనసాగించాడు

కాగా నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టులో రోహిత్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. టాపార్డర్‌లోని మిగతా బ్యాటర్లు విఫలమైనా రోహిత్ మాత్రం ఒంట‌రి పోరు చేశాడు. తద్వారా కెరీర్‌లో 9వ టెస్ట్‌ సెంచరీని సాధించాడు. అన్ని ఫార్మాట్ల‌లో సెంచ‌రీలు న‌మోదు చేసిన తొలి భార‌త కెప్టెన్‌గా నిలిచాడు. టెస్టులు, వ‌న్డేలు, టీ20ల్లో కెప్టెన్‌గా సెంచ‌రీలు చేసిన ఘ‌న‌త‌ను అత‌ను ద‌క్కించుకున్నాడు. ఇక ఢిల్లీ టెస్టులోనూ రోహిత్‌ మెరుపులు కొనసాగాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ చేరాలంటే ఢిల్లీ టెస్టులో భారత జట్టు విజయం సాధించడం తప్పనిసరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..