IND vs AFG: రంజీల్లో ఆడేందుకు సరిపోడు.. కేవలం కెప్టెన్ గిల్‌ ఫ్రెండ్‌షిప్‌తో జట్టులో స్థానం.. ఎవరంటే?

Gurnoor Brar Selection Controversy: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే వన్డే, టెస్టు సిరీస్‌ల కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టు ఎంపికపై ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం రంజీ ట్రోఫీలో కూడా చెప్పుకోదగ్గ రికార్డులు లేని ఓ ఆటగాడికి, కేవలం కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో ఉన్న ప్రాణస్నేహం వల్లే భారత జట్టులో చోటు దక్కిందనే ఆరోపణలు క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

IND vs AFG: రంజీల్లో ఆడేందుకు సరిపోడు.. కేవలం కెప్టెన్ గిల్‌ ఫ్రెండ్‌షిప్‌తో జట్టులో స్థానం.. ఎవరంటే?
Gurnoor Brar Selection Controversy

Updated on: May 21, 2026 | 6:47 AM

Gurnoor Brar Selection Controversy: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించిన జట్టు ఎంపిక ప్రక్రియపై మరోసారి బంధుప్రీతి, పక్షపాత ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు సగటు క్రికెట్ అభిమానికి సైతం విస్మయం కలిగిస్తున్నాయి. దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతాలు సృష్టిస్తున్న ఎందరో ప్రతిభావంతులను పక్కనబెట్టి, రికార్డులు అంతగా లేని ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం వెనుక తెరవెనుక రాజకీయం నడుస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా ఈ పర్యటనకు సారథిగా వ్యవహరిస్తున్న యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు అత్యంత ఆప్తుడైన గుర్నూర్ బ్రార్‌కు జట్టులో స్థానం కల్పించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. రంజీల్లో ఆడేందుకే సరిపోని ఆటగాడికి ఏకంగా భారత జట్టు జెర్సీ ఎలా ఇస్తారంటూ విమర్శకులు మండిపడుతున్నారు.

గిల్ స్నేహమే గుర్నూర్‌కు వరమైందా?

25 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ కెరీర్ మలుపు తిరగడం వెనుక శుభ్‌మన్ గిల్ హస్తం ఉందనేది జగమెరిగిన సత్యం. జిల్లా స్థాయి క్రికెట్ ఆడుతున్న సమయంలోనే గుర్నూర్ ప్రతిభను చూసిన గిల్, అప్పట్లో అతని కోసం ప్రత్యేకంగా సిఫార్సులు చేసి జిల్లా జట్టులో, ఆ తర్వాత అండర్-23 జట్టులో స్థానం దక్కేలా చేశాడు. అంతటితో ఆగకుండా గిల్ తన ప్రభావంతో గుర్నూర్‌కు గుజరాత్ టైటాన్స్ జట్టులోనూ చోటు దక్కేలా అండగా నిలిచాడు. ఇప్పుడు గిల్ చేతికి టీమ్ ఇండియా కెప్టెన్సీ పగ్గాలు రావడంతో, తన స్నేహితుడికి ఏకంగా జాతీయ జట్టులోనే చోటు కల్పించాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

గందరగోళంలో పడేస్తున్న గుర్నూర్ రంజీ రికార్డులు..

గుర్నూర్ బ్రార్ రికార్డులను ఒకసారి పరిశీలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. 2022లో పంజాబ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఇతడు, ఇప్పటివరకు 18 మ్యాచ్‌లలో కేవలం 52 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. సగటు, స్ట్రైక్ రేట్ పరంగా చూసినా ఇవి అత్యంత సాధారణ గణాంకాలుగా కనిపిస్తాయి. తన కెరీర్‌లో కేవలం ఒక్కసారి మాత్రమే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన గుర్నూర్, కనీసం గత రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో తన సొంత రాష్ట్ర జట్టులోనే ఆడలేదు. రంజీలకే దూరం అయిన ఆటగాడిని ఏకంగా దేశం తరపున ఆడేందుకు ఎలా ఎంపిక చేశారనే ప్రశ్నకు సెలెక్టర్ల వద్ద సమాధానం లేదు.

పరుగుల వేటగాడు ఆకిబ్ నబీకి ఘోర అన్యాయం..

గుర్నూర్ బ్రార్‌కు చోటు కల్పించడం కోసం జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీని సెలెక్టర్లు పూర్తిగా తొక్కేశారు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో ఆకిబ్ నబీ బంతితో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కేవలం 10 మ్యాచ్‌ల్లోనే 17 ఇన్నింగ్స్‌లు ఆడి ఏకంగా 60 వికెట్లు పడగొట్టి, జమ్మూ కాశ్మీర్ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఈ సీజన్‌లో ఏడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన ఈ యువ కిరాణాన్ని కాదని, కనీసం మ్యాచ్‌లు కూడా ఆడని గుర్నూర్‌ను ఎంపిక చేయడం సెలెక్షన్ కమిటీలోని పక్షపాత ధోరణికి అద్దం పడుతోంది.

భారత క్రికెట్‌లో ప్రతిభ ఆధారంగా కాకుండా పలుకుబడి, స్నేహాల ఆధారంగా అవకాశాలు ఇస్తే దేశవాళీ క్రికెట్‌లో రక్తం చిందిస్తున్న ఎంతోమంది యువ ఆటగాళ్ల భవిష్యత్తు అంధకారమవుతుంది. కెప్టెన్ ఇష్టాయిష్టాల ప్రకారం జట్టు ఎంపిక జరిగితే అది భారత క్రికెట్ పతనానికి దారితీస్తుంది. ఇప్పటికైనా బీసీసీఐ పెద్దలు జోక్యం చేసుకుని, కేవలం ప్రతిభను మాత్రమే ప్రామాణికంగా తీసుకునేలా చర్యలు చేపట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us