IND Vs ENG: 6,6,6,6,6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ మరణశాసనం.. కేవలం 19 బంతుల్లోనే.! సుడి తిరిగిందిగా

14 ఏళ్ల చిచ్చరపిడుగు.. మరోమారు ఇంగ్లాండ్‌లో రచ్చ లేపాడు.. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లాండ్‌ అండర్-19తో జరుగుతోన్న యూత్ వన్డే సిరీస్‌లో బౌండరీల వర్షం కురిపించాడు వైభవ్.. మరి ఆ ఇన్నింగ్స్ ఏంటో.? ఇప్పుడు చూసేద్దాం మరి.

IND Vs ENG: 6,6,6,6,6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ మరణశాసనం.. కేవలం 19 బంతుల్లోనే.! సుడి తిరిగిందిగా
Vaibhav Suryavanshi

Updated on: Jun 27, 2025 | 8:54 PM

వైభవ్ సూర్యవంశీ తుఫాను ఇన్నింగ్స్ ఇంగ్లాండ్‌ జట్టును బెంబేలెత్తించింది. IPL 2025లో అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఓ ఆట ఆడుకున్న వైభవ్.. ఇప్పుడు ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరుగుతోన్న యూత్ ODI సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. సిక్సర్లు, ఫోర్లతో రచ్చచేశాడు. వైభవ్ 19 బంతుల్లో తన తుఫాను ఇన్నింగ్స్‌లో 48 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్లు గత కొన్ని నెలలుగా దేశీయ క్రికెట్ నుంచి అండర్-19 క్రికెట్ వరకు, ఆపై ఐపీఎల్ 2025లో తమ బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించారు. ముఖ్యంగా ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా సెంచరీ చేసి వైభవ్ రికార్డుల్లోకి ఎక్కాడు.

జూన్ 27వ తేదీ శుక్రవారం ఇంగ్లాండ్‌ హోవ్‌లోని సస్సెక్స్ కౌంటీ గ్రౌండ్‌లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో.. ఇంగ్లాండ్ అండర్-19 జట్టు కేవలం 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత వైభవ్ టీమ్ ఇండియాకు తుఫాను ఆరంభం ఇచ్చాడు. ఈ యువ బ్యాట్స్‌మెన్ తన మొదటి సిక్స్‌గా బాదాడు. దీని తర్వాత వైభవ్ సిక్సర్లు, ఫోర్లలో మాత్రమే పరుగులు సాధించడం విశేషం. ముఖ్యంగా ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో వైభవ్ 3 సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్ చివరి రెండు బంతుల్లో వరుసగా 2 సిక్సర్లు కొట్టాడు. వైభవ్ తన అర్ధసెంచరీ వైపు సాగుతుండగా.. ఎనిమిదో ఓవర్‌లో స్పిన్నర్‌ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి.. పెవిలియన్ చేరాడు వైభవ్. మొత్తం మీద వైభవ్ ఇన్నింగ్స్‌లో కేవలం 19 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టి 48 పరుగులు చేశాడు. అంటే అతడు బౌండరీల రూపంలో ఏకంగా 42 పరుగులు చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ విరాట్ జెర్సీ నెంబర్ 18 ధరించిన విషయం తెలిసిందే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి