Sanju Samson : ద్రవిడ్ కే క్లాస్ పీకిన కుర్రాడు… సంజూ శాంసన్ పేల్చిన జోకులకు వేదిక అంతా ఫిదా

Sanju Samson : బీసీసీఐ నమన్ అవార్డ్స్ లో వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సరదా వ్యాఖ్యలు చేశారు. తొలి బంతికే సిక్సర్ కొడతానని ద్రవిడ్ తో చెప్పి మరీ వైభవ్ ఐపీఎల్ లో అదరగొట్టిన వైనాన్ని వివరించారు. వైభవ్ ధైర్యం, ఆత్మవిశ్వాసం చూసి దిగ్గజ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం షాక్ అయ్యాడు.

Sanju Samson : ద్రవిడ్ కే క్లాస్ పీకిన కుర్రాడు... సంజూ శాంసన్ పేల్చిన జోకులకు వేదిక అంతా ఫిదా
Sanju Samson, Vaibhav Sooryavanshi

Updated on: Mar 16, 2026 | 10:53 AM

Sanju Samson : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున కేవలం 14 ఏళ్ల వయసులోనే అరంగేట్రం చేసి, అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన ఈ బిహార్ సెన్సేషన్.. అండర్-19 వరల్డ్ కప్ 2026లోనూ భారత్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా జరిగిన బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026 వేడుకలో ఈ యువ కెరటంపై రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ ధైర్యం, ఆత్మవిశ్వాసం చూసి దిగ్గజ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఎలా షాక్ అయ్యారో ఒక సరదా సందర్భాన్ని పంచుకున్నాడు.

నమన్ అవార్డ్స్ వేదికపై సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ఐపీఎల్ 2025లో వైభవ్ అరంగేట్రం చేయడానికి ముందు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. “అప్పుడు రాహుల్ ద్రవిడ్ సార్ వైభవ్ దగ్గరికి వెళ్లి.. ఏంటి వైభవ్, రేపటి మ్యాచ్‌కు నీ ప్లాన్ ఏంటి? అని అడిగారు. దానికి వైభవ్ ఏమాత్రం తడబడకుండా.. ప్లాన్ ఏముంది సార్.. జస్ట్ ఆడతాను. ఫస్ట్ బాల్ దొరికితే చాలు, గాల్లోకి లేపేస్తాను అని చాలా కూల్‌గా చెప్పాడు” అంటూ సంజూ ఆ కుర్రాడి వాయిస్‌ను ఇమిటేట్ చేసి చూపించాడు. వైభవ్ చెప్పినట్లే తన డెబ్యూ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మాటలు విన్న రాహుల్ ద్రవిడ్, హార్దిక్ పాండ్యా సహా అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.

వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై సంజూ ప్రశంసల వర్షం కురిపించాడు. మైదానంలో వైభవ్ ఆడుతుంటే ఏదో వీడియో గేమ్ ఆడుతున్నట్లు ఉంటుందని, ఎవరికీ భయపడకుండా తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తాడని కొనియాడాడు. గత ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై జైపూర్ వేదికగా కేవలం 38 బంతుల్లోనే సెంచరీ (101 పరుగులు) బాదిన విషయాన్ని సంజూ గుర్తు చేశాడు. అంత చిన్న వయసులో అంతటి వేగంగా పరుగులు సాధించడం సామాన్యం కాదని అభిప్రాయపడ్డాడు. అండర్-19 వరల్డ్ కప్‌లో కూడా ఆస్ట్రేలియాపై వైభవ్ చేసిన సెంచరీ భారత్‌కు టైటిల్ అందించడంలో ప్రధాన భూమిక పోషించింది.

ఇదే ఈవెంట్‌లో తన భవిష్యత్తు లక్ష్యాల గురించి వైభవ్ మాట్లాడాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ట్రోఫీ అందించడమే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పాడు. అంతేకాకుండా, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బద్దలు కొట్టాలని ఉందని తన కలని బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (175 పరుగులు) పేరిట ఉంది. ఈ రికార్డును తుడిచిపెట్టడమే తన లక్ష్యమని వైభవ్ ధీమాగా చెప్పాడు. ఈ 14 ఏళ్ల వండర్ కిడ్ తన బ్యాట్‌తో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో అని క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us