Vinod Kambli: పెన్షన్‌ సరిపోవడం లేదు.. ఏదైనా పని చూపించండి.. దీనావస్థలో సచిన్‌ చిన్ననాటి స్నేహితుడు

|

Aug 17, 2022 | 5:42 PM

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో పోటాపోటీగా పరుగులు.. సెంచరీల మీద సెంచరీలు.. బ్రియాన్‌లారాను మరిపించేలా లెఫ్ట్‌ హ్యాండెడ్‌ సొగసరి డ్రైవ్‌లు.. వెరసి 90వ దశకంలో క్రికెట్‌ అభిమానులను అలరించిన ఆటగాళ్లలో వినోద్‌కాంబ్లీ (Vinod Kambli) ఒకరు.

Vinod Kambli: పెన్షన్‌ సరిపోవడం లేదు.. ఏదైనా పని చూపించండి.. దీనావస్థలో సచిన్‌ చిన్ననాటి స్నేహితుడు
Vinod Kambli
Follow us on

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో పోటాపోటీగా పరుగులు.. సెంచరీల మీద సెంచరీలు.. బ్రియాన్‌లారాను మరిపించేలా లెఫ్ట్‌ హ్యాండెడ్‌ సొగసరి డ్రైవ్‌లు.. వెరసి 90వ దశకంలో క్రికెట్‌ అభిమానులను అలరించిన ఆటగాళ్లలో వినోద్‌కాంబ్లీ (Vinod Kambli) ఒకరు. అయితే జెంటిల్మెన్‌గేమ్‌గా చెప్పుకునే క్రికెట్‌లో ఎక్కువ రోజులు రాణించాలంటే ఆట ఒక్కటే సరిపోదు. అంతకుమించిన క్రమశిక్షణ కూడా ఉండాలి. ఇక్కడే కాంబ్లీ తప్పటడుగులు వేశాడు. ఒకానొకదశలో తన అత్యుత్తమ ఫామ్‌తో సచిన్‌ను మించిపోయేలా కనిపించిన అతను ఆడంబర జీవితానికి అలవాటుపడ్డాడు. క్రమశిక్షణ లేమితో తాగుడుకు బానిసై క్రమంగా ఫామ్‌ కోల్పోయాడు. పరుగులు చేసేందుకు తంటాలు పడ్డాడు. ఫలితంగా జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ఆతర్వాత జట్టులోకి వచ్చినా మునపటి స్థాయిలో ఆడలేకపోయాడు. మొత్తం తొమ్మిదిసార్లు పునరాగమనాలు చేసిన తర్వాత కూడా తను లయ అందుకోలేకపోయాడు. దీంతో జట్టుకు శాశ్వతంగా దూరం కావాల్సొచ్చింది.

ఇలా వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో నిత్యం వివాదాలతో సహవాసం చేసిన వినోద్‌ కాంబ్లీ ప్రస్తుతం దీన పరిస్థితుల్లో బతుకీడుస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి పూట గడవని పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అందుకే క్రికెట్‌కు సంబంధించి ఏదైనా పని ఇవ్వాలని బీసీసీఐని దీనంగా వేడుకుంటున్నాడు. ఇప్పటివరకు బీసీసీఐ ఇస్తోన్న 30 వేల పెన్షనే తనను, తన కుటుంబాన్ని బతికిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుతం పెరిగిన ఖర్చుల రీత్యా పెన్షన్ సరిపోవడం లేదని, అందుకే ఏదైనా పని ఇప్పించాలని దీనంగా అభ్యర్థిస్తున్నాడు.

సచిన్‌ ఇప్పటికే చాలా చేశాడు..

ఇవి కూడా చదవండి

కాగా తన ఆర్థిక కష్టాల గురించి చిన్ననాటి స్నేహితుడు సచిన్‌కు తెలుసా..? అని ప్రశ్నించగా.. అతనికి తెలుసని సమాధానమిచ్చాడు కాంబ్లీ. ‘ కొద్దిరోజుల క్రితం వరకు నేరుల్‌లోని టెండుల్కర్ మిడిల్ సెక్స్ గ్లోబల్ అకాడమీలో యువ క్రికెటర్లకు మెంటార్‌గా పని చేసేవాడినని. నేరుల్ నా నివాసానికి చాలా దూరంగా ఉండటంతో సగం రోజు ప్రయాణానానికే సరిపోతుంది. అందుకే తప్పని పరిస్థితుల్లో ఆ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఇక నాకు ఈ ఉద్యోగం ఇప్పించింది సచినే. అతను ఇప్పటికే నాకెంతో సహాయం చేశాడు. అతనో గొప్ప స్నేహితుడు. నా బాగోగులు కోరే వారిలో సచిన్‌ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు ‘ అని కాంబ్లీ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున 17 టెస్ట్‌లు, 104 వన్డేలు ఆడిన కాంబ్లీ 3,500కు పైగా పరుగులు చేశాడు. వన్డేల్లో 2 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలు చేసిన కాంబ్లీ ఖాతాలో 4 టెస్ట్‌ సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అప్పట్లోనే టెస్టుల్లో వరుసగా రెండు డబుల్‌ సెంచరీలు కొట్టి సంచలనం సృష్టించాడు.

ఇది కూడా చదవండి:  టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..