
Hardik Pandya : టీ20 ప్రపంచకప్ 2026 గ్రాండ్ సక్సెస్ తర్వాత టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫుల్ జోష్‌లో ఉన్నాడు. మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే ఈ స్టార్ ప్లేయర్, ఇప్పుడు లగ్జరీ కార్ల విషయంలోనూ తన రేంజ్ ఏంటో చూపించాడు. ప్రపంచకప్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ తనకు తానుగా ఒక అరుదైన బహుమతి ఇచ్చుకున్నాడు. ఏకంగా రూ.10 కోట్లకు పైగా విలువ చేసే ఫెరారీ 12 సిలిండ్రీ (Ferrari 12Cilindri) సూపర్ కార్‌ను తన గ్యారేజీలోకి చేర్చుకున్నాడు. ఈ ఖరీదైన కారులో తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి ముంబై రోడ్లపై చక్కర్లు కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
హార్దిక్ కొనుగోలు చేసిన ఈ బ్లాక్ కలర్ ఫెరారీ కారు భారతదేశంలోనే అత్యంత అరుదైన వాహనాల్లో ఒకటి. కేవలం ఇద్దరు మాత్రమే కూర్చోగలిగే ఈ కన్వర్టిబుల్ మోడల్, ఫెరారీ బ్రాండ్ లోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది నేచురల్లీ ఆస్పిరేటెడ్ V12 ఇంజన్‌తో వస్తుంది. అంటే ఎలాంటి హైబ్రిడ్ సాయం లేకుండా కేవలం ఇంజన్ పవర్ తోనే దూసుకెళ్తుంది. కేవలం 2.9 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ కారు గరిష్ట వేగం గంటకు 340 నుంచి 350 కిలోమీటర్లు. కేవలం బడా వ్యాపారవేత్తలు, కార్ కలెక్టర్లు మాత్రమే కొనుగోలు చేసే ఇలాంటి కారు ఇప్పుడు పాండ్యా సొంతమైంది.
హార్దిక్ పాండ్యాకు కార్లంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆయన దగ్గర కోట్లాది రూపాయల విలువైన కార్ల కలెక్షన్ ఉంది. రూ.4 కోట్ల విలువైన లంబోర్గిణి హురాకాన్ ఎవో, రోల్స్ రాయిస్ ఫాంటమ్, లంబోర్గిణి ఉరుస్, మెర్సిడెస్ AMG G63, రేంజ్ రోవర్ వోగ్ వంటి ఎన్నో ఖరీదైన కార్లు ఆయన గ్యారేజీలో ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన ఈ ఫెరారీ మాత్రం వాటన్నింటికీ కింగ్ మాదిరి నిలుస్తోంది. క్రికెట్ మైదానంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న హార్దిక్, తన పర్సనల్ లైఫ్‌లోనూ ఇలాంటి లగ్జరీలతో వార్తల్లో నిలుస్తుంటాడు.
ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన హార్దిక్, ఆ సమయంలో ధరించిన రూ.3.89 లక్షల విలువైన స్కెలిటన్ వాచ్ కూడా అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఏకంగా పది కోట్ల కారును కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ కొత్త కారులో హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఒకవైపు క్రికెట్ రికార్డులు, మరోవైపు లగ్జరీ లైఫ్ స్టైల్‌తో హార్దిక్ పాండ్యా ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..