
Hardik Pandya : టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి తన ఆటతోనో లేదా వివాదంతోనో కాదు, తన క్రికెట్ ఐడల్ విషయంలో ఆయన చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఏ భారతీయ క్రికెటర్‌నైనా మీ ఐడల్ ఎవరని అడిగితే సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ లేదా రాహుల్ ద్రావిడ్ పేర్లు చెబుతారు. కానీ బీసీసీఐ నమాన్ అవార్డ్స్ 2026(BCCI Naman Awards) వేడుకలో పాండ్యా మాట్లాడుతూ.. మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తన క్రికెట్ ఐడల్ అని వెల్లడించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
వసీం జాఫర్ టీమిండియా తరపున 31 టెస్టులు ఆడి 1,944 పరుగులు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయన ప్రయాణం తక్కువ కాలమే అయినా, దేశీయ క్రికెట్ లో మాత్రం ఆయన ఒక రారాజు. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా (12,000 పైగా పరుగులు) రికార్డు సృష్టించారు. దాదాపు 20,000 ఫస్ట్ క్లాస్ పరుగులు చేసిన జాఫర్ బ్యాటింగ్ క్లాస్ కు తాను ఫిదా అయ్యానని పాండ్యా ఈ సందర్భంగా పేర్కొన్నారు. 90వ దశకంలో పెరుగుతున్నప్పుడు ఐడల్ గా లెజెండ్లను కాకుండా, ఒక డొమెస్టిక్ గెయింట్‌ను ఎంచుకోవడం పాండ్యా ప్రత్యేకతను చాటుతోంది.
ఇదే వేడుకలో యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ తమ ఆరాధ్య దైవం యువరాజ్ సింగ్ అని ప్రకటించారు. సూర్యవంశీ అదనంగా బ్రియాన్ లారా పేరును కూడా ప్రస్తావించారు. ఇక టీమిండియా టీ20 ఓపెనర్ సంజూ శామ్సన్ తన ఐడల్ ఎప్పటికీ సచిన్ టెండూల్కరే అని స్పష్టం చేశారు. ఈ అవార్డుల వేడుకలో 2024-25 సీజన్‌లో అద్భుతంగా రాణించిన శుభ్‌మన్ గిల్, స్మృతి మంధానలకు బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డులు దక్కాయి. గిల్ పాలీ ఉమ్రిగర్ అవార్డును రెండోసారి అందుకోగా, స్మృతి ఈ గౌరవాన్ని ఐదోసారి సొంతం చేసుకున్నారు.
Champions take on some quick-fire questions! ⚡
First game? First vehicle? & more ft Hardik Pandya, Abhishek Sharma, Sanju Samson and Vaibhav Sooryavanshi! 🙌 #NamanAwards pic.twitter.com/pj9KDOma68
— Star Sports (@StarSportsIndia) March 15, 2026
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల విభాగంలో మాజీ స్టార్లైన రోజర్ బిన్నీ, రాహుల్ ద్రావిడ్, మిథాలీ రాజ్‌లను బీసీసీఐ అత్యున్నత పురస్కారమైన కల్నల్ సి.కె. నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది. 2025, 2026 సంవత్సరాల్లో ఐసీసీ టైటిళ్లను గెలిచిన ఐదు భారతీయ జట్లను కూడా ఈ వేడుకలో ఘనంగా సన్మానించారు. మొత్తంమీద, అవార్డుల సందడి కంటే హార్దిక్ పాండ్యా చేసిన వసీం జాఫర్ వ్యాఖ్యలే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..