అత్యాచారం కేసులో అరెస్టయిన శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకకు బెయిల్ లభించింది. గుణతిలక సిడ్నీ టీమ్ హోటల్ నుంచి వస్తున్నప్పుడు అత్యాచార ఆరోపణలపై అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతను 11 రోజుల పాటు జైలులో ఉన్నాడు. ఈ విషయంలో శ్రీలంక క్రికెట్ అసోసియేషన్ కలగజేసుకోడంతో అతను బెయిల్ పొందాడు. దీని కోసం అతను కోటి రూపాయలు జామీనుగా కట్టాల్సి వచ్చింది. టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలగిన శ్రీలంక జట్టు.. తిరిగి స్వదేశానికి వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో.. నవంబర్ 6న అర్ధరాత్రి ధనుష్క గుణతిలక అరెస్టు ఘటన జరిగింది. టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక తన చివరి మ్యాచ్‌ను ఇంగ్లండ్ టీమ్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌లో శ్రీలంక ఓటమిని చవిచూసింది. అయితే గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు ముందే గుణతిలక తన జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో టీమ్ మరో వ్యక్తిని ఎంపిక చేసుకుంది. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ సలహా మేరకు ఆ తర్వాత కూడా అతను అక్కడే ఉండిపోయాడు. గుణతిలకను డేటింగ్ యాప్ ద్వారా కలిసిన 29 ఏళ్ల ఓ యువతి..అతను తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది.
మహిళ ఆరోపణల నేపథ్యంలో సిడ్నీలోని ససెక్స్ స్ట్రీట్ హోటల్‌లో ఉన్న ధనుష్క గుణతిలకను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిడ్నీ కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలోనే అతనికి బెయిల్‌ను మంజూరు చేస్తారని అందరూ అనుకున్నారు కానీ కోర్టు తిరస్కరించింది.
సుమారు 11 రోజుల పాటు కటకటాల వెనక ఉన్న గుణతిలకకు సిడ్నీ స్థానిక కోర్టు బెయిల్ ఇచ్చింది. కోర్టు బెయిల్‌ను మంజూరు చేయడంతో అతనికి, అతని కుటుంబానికి కొంత ఊరటనిచ్చినట్లయింది. అయితే బెయిల్ కోసం అతను కోటి రూపాయలు పూచీకత్తుగా కట్టవలసి వచ్చింది.
తాజాగా అత్యాచార ఆరోపణలతో అరెస్టయిన ధనుష్క గుణతిలకకు వివాదాల్లో చిక్కుకోవడం ఇదేం తొలిసారి కాదు. శ్రీలంక క్రికెట్ బోర్డు ఆ యువ ఆటగాడిని 2018 లో 6 మ్యాచ్‌ల నుంచి నిషేధింది. ఆ సమయంలో గుణతిలక నార్వేకు చెందిన ఓ మహిళపై అత్యాచారం చేసినట్లు కేసులో చిక్కుకుని ఉన్నాడు. ఆస్ట్రేలియాలో అత్యాచార ఆరోపణలతో అతను అరెస్ట్ అయినప్పుడు కూడా శ్రీలంక క్రికెట్ బోర్డు అతనిని క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి నిషేధించింది .
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..