AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియాకి మాత్రమే ఆ ఛాన్స్.. మాకివ్వలేదు.! నోరుజారిన ఆ జట్టు కెప్టెన్..

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌తో కీలక మ్యాచ్‌ తర్వాత నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ ఐసీసీ షెడ్యూలింగ్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తమ జట్టుకు రాత్రి ప్రాక్టీస్ సెషన్ కేటాయించకపోవడం, భారత్‌కు రెండు సెషన్లు ఇవ్వడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. నైట్ మ్యాచ్‌లకు సిద్ధపడటం కష్టమని, తమ విజయ అవకాశాలపై ప్రభావం చూపిందని ఆందోళన వ్యక్తం చేశాడు.

Team India: టీమిండియాకి మాత్రమే ఆ ఛాన్స్.. మాకివ్వలేదు.! నోరుజారిన ఆ జట్టు కెప్టెన్..
Ind Vs Nam
Ravi Kiran
|

Updated on: Feb 13, 2026 | 6:42 PM

Share

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఆతిథ్య భారత్‌తో ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కీలక మ్యాచ్ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ మ్యాచ్‌లో నమీబియా జట్టు కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ ఐసీసీ షెడ్యూలింగ్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ప్రాక్టీస్ సెషన్ల కేటాయింపులో తమకు తీవ్ర వివక్ష జరిగిందని అతడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్ అనంతరం నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టుకు ఒక్క నైట్ ప్రాక్టీస్ సెషన్ కూడా కేటాయించలేదని, అదే సమయంలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌కు మాత్రం రెండు రాత్రి సెషన్లు ఇచ్చారని పేర్కొన్నాడు. నైట్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సమయాల్లో ఇలా తేడాలు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని, అసలు ఇలా ఎందుకు జరుగుతుందో మీరే ఆలోచించుకోవాలని అతడు పరోక్షంగా నిర్వాహకులపై చురకలు అంటించాడు.

నమీబియా లాంటి చిన్న దేశాలకు రాత్రి వేళల్లో ఆడటం అనేది ఒక పెద్ద సవాలని ఎరాస్మస్ వివరించాడు. తమ దేశంలో ఫ్లడ్ లైట్ సదుపాయం లేని స్టేడియాలు ఉండటమే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. మౌలిక సదుపాయాల కొరత వల్ల ఆటగాళ్లకు ఫ్లడ్ లైట్ల వెలుతుర్లో బంతిని అంచనా వేయటం కష్టంగా ఉంటుందని, ఫ్రాంచైజీ లీగ్‌లో ఆడే కొందరు సీనియర్లు మినహా మిగిలిన యువ ఆటగాళ్లకు ఇది పూర్తిగా కొత్త అనుభవం అని అతడు గుర్తు చేసుకున్నాడు. ఈ పరిస్థితుల్లో మ్యాచ్ జరిగే సమయానికి అనుగుణంగా శిక్షణ పొందే అవకాశం ఇవ్వకపోవడం తమ విజయ అవకాశాలను దెబ్బతీసిందని చెప్పాడు. అయితే, ఈ షెడ్యూలింగ్ వివాదంపై ఐసీసీ స్పందించింది. జనవరి 27నే అన్ని జట్లకు షెడ్యూల్‌ను పంపించామని, నమీబియా నుంచి మార్పుల కోసం అభ్యర్థన చాలా ఆలస్యంగా ఫిబ్రవరి 10న అందిందని వెల్లడించింది. సమయం తక్కువగా ఉండటం వల్ల చివరి నిమిషంలో మార్పులు చేయడం సాధ్యం కాలేదని ఐసీసీ అధికారులు స్పష్టం చేశారు.