AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Gambhir : సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్ ను ఆడుకుంటున్న నెటిజన్లు.. అసలు గొడవేందంటే ?

భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ ముగిసినప్పటికీ, సిరీస్‌లోని ఒక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను సోషల్ మీడియాలో విమర్శలకు గురి చేస్తోంది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో బెస్ట్ ప్లేయర్‌గా గంభీర్ హ్యారీ బ్రూక్‌ను సెలక్ట్ చేయడమే ఈ వివాదానికి కారణం.

Gautam Gambhir : సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్ ను ఆడుకుంటున్న నెటిజన్లు.. అసలు గొడవేందంటే ?
Gautam Gambhir
Rakesh
|

Updated on: Aug 06, 2025 | 5:50 PM

Share

Gautam Gambhir : భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్ ముగిసింది. అయితే, సిరీస్ ఫలితం కంటే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గురించే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ అవార్డు ఎంపిక వెనుక టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నారన్న వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై నెటిజన్లు గంభీర్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. అసలు, ఏ విషయంలో గంభీర్‌ను ఇంతలా ట్రోల్ చేస్తున్నారు? ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఎంపికలో గంభీర్ పాత్ర ఏంటి? ఆ వివరాలు తెలుసుకుందాం.

సాధారణంగా ఒక టెస్ట్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఇద్దరు ఆటగాళ్లకు ఇస్తారు. ఒకరు గెలిచిన జట్టు నుంచి, మరొకరు ఓడిన జట్టు నుంచి. అయితే, ఈ అవార్డు ఎంపికకు ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. గెలిచిన జట్టు నుంచి బెస్ట్ ప్లేయర్‎ను ఓడిన జట్టు కోచ్ సెలక్ట్ చేస్తారు. అదేవిధంగా, ఓడిన జట్టు నుంచి ఉత్తమ ఆటగాడిని గెలిచిన జట్టు కోచ్ ఎంపిక చేస్తారు.

ఈ సిరీస్‌లో భారత్ గెలిచింది కాబట్టి, ఓడిన ఇంగ్లాండ్ జట్టు నుంచి బెస్ట్ ప్లేయర్ ను సెలక్ట్ చేసే బాధ్యత టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్‌పై పడింది. అలాగే, భారత్ నుంచి బెస్ట్ ప్లేయర్ ను సెలక్ట్ చేసే బాధ్యత ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌పై పడింది.

ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ టీమ్ ఇండియా నుంచి శుభ్‌మన్ గిల్‌ను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కోసం సెలక్ట్ చేశారు. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా గిల్ నిలిచాడు. గిల్ మొత్తం 5 మ్యాచ్‌లలో 754 పరుగులు చేసి, అందరి ప్రశంసలు అందుకున్నాడు. మెక్‌కల్లమ్ నిర్ణయంతో ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం లేదు.

ఇప్పుడు అసలు వివాదంలోకి వస్తే, టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఇంగ్లాండ్ జట్టు నుంచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కోసం హ్యారీ బ్రూక్ పేరును సెలక్ట్ చేశారు. ఈ నిర్ణయమే ఇప్పుడు పెద్ద దుమారానికి కారణమైంది. ఈ సిరీస్‌లో బ్రూక్ 53.44 సగటుతో 481 పరుగులు చేశాడు. అయితే, ఇదే సిరీస్‌లో బ్రూక్ కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు జో రూట్ ఉన్నాడు.

జో రూట్ ఈ సిరీస్‌లో 67.12 సగటుతో 537 పరుగులు సాధించాడు. గణాంకాల ప్రకారం చూస్తే, హ్యారీ బ్రూక్ కంటే జో రూట్ ప్రదర్శన చాలా మెరుగ్గా ఉంది. అయినా కూడా, గంభీర్ జో రూట్‌ను కాకుండా బ్రూక్‌ను ఎంపిక చేయడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బ్రూక్ కూడా అవార్డు అందుకున్న తర్వాత “ఈ అవార్డుకు నా కంటే జో రూట్ ఎక్కువ అర్హుడు” అని చెప్పడం గమనార్హం.

సోషల్ మీడియాలో నెటిజన్లు గౌతమ్ గంభీర్‌ను ట్రోల్ చేస్తూ.. “గంభీర్ లెక్కలు సరిగా నేర్చుకోలేదు”, “జో రూట్‌ను ఎందుకు సెలక్ట్ చేయలేదో అర్థం కావట్లేదు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. బ్రూక్ ప్రదర్శన పట్ల గౌరవం ఉన్నప్పటికీ, జో రూట్ ప్రదర్శనను పక్కన పెట్టడం సరికాదని చాలామంది వాదిస్తున్నారు. క్రీడా గణాంకాలు, ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగానే అవార్డులు ఇవ్వాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..