AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India : భారత క్రికెట్‌లో మరో కుదుపు.. టీమిండియాకు గంభీర్ నమ్మిన బంటులు గుడ్ బై ?

Team India : ఇంగ్లండ్ పర్యటన తర్వాత టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్‌కు సన్నిహితులైన ర్యాన్ టెన్ డోస్కాట్, మోర్నీ మోర్కెల్ వైదొలగనున్నారనే వార్తలు క్రికెట్ ప్రపంచంలో ఆసక్తి రేపుతున్నాయి.

Team India : భారత క్రికెట్‌లో మరో కుదుపు.. టీమిండియాకు గంభీర్ నమ్మిన బంటులు గుడ్ బై ?
Team India
Rakesh
|

Updated on: Jul 12, 2026 | 4:40 PM

Share

Team India :టీమిండియాలో ఓటముల పరంపర కొనసాగుతున్న తరుణంలో తెరవెనుక మరో పెద్ద సంక్షోభం మొదలైంది. ఐర్లాండ్ చేతిలో 2-0తో, ఇంగ్లండ్ చేతిలో 4-0తో టీ20 సిరీస్‌లను ఘోరంగా ఓడిపోయిన తర్వాత, టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో అనిశ్చితి నెలకొంది. జట్టు ప్రదర్శనపై బీసీసీఐ (BCCI) త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహించనుండగా, ఆలోపే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గంభీర్ ఎంతో నమ్మకంగా జట్టులోకి తెచ్చుకున్న ఇద్దరు ముఖ్యమైన సపోర్ట్ స్టాఫ్ సభ్యులు తమ పదవుల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటన ముగిసిన వెంటనే అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాట్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ భారత్‌ను వీడనున్నట్లు తెలుస్తోంది.

టీమిండియాను వీడి ఐపీఎల్‌లోకి

గత 2024లో గౌతమ్ గంభీర్ భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు, ఈ ఇద్దరు కోచ్‌లు జట్టులో చేరారు. భారత జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలను బలోపేతం చేయడం కోసం గంభీర్ స్వయంగా వీరిద్దరిని ఎంపిక చేసుకున్నారు. అయితే, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ర్యాన్ టెన్ డోస్కాట్ టీమిండియాతో కొనసాగడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఏడాది పొడవునా జట్టుతో కలిసి నిరంతరం ప్రయాణాలు చేయడం తనకు ఇబ్బందిగా మారిందని ఆయన బీసీసీఐకి తెలిపినట్లు సమాచారం. దీనికి తోడు ఆయన ఒక ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీతో కోచింగ్ పదవి కోసం చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా వన్డే సిరీస్ ముగిసిన తర్వాత తన భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఇద్దరితో బీసీసీఐ అధికారులు మాట్లాడుతున్నారని, సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని బోర్డు వర్గాలు తెలిపాయి.

జింబాబ్వే టూర్‌కు గంభీర్ దూరం

ఇంగ్లండ్ పర్యటన ముగిసిన వెంటనే భారత జట్టు జూలై 2026 చివరి వారంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. జూలై 23న మొదటి టీ20, జూలై 25న రెండో మ్యాచ్, జూలై 26న మూడో మ్యాచ్ జరగనున్నాయి. అయితే ఈ జింబాబ్వే పర్యటనకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వెళ్లడం లేదు. ఆయనకు విశ్రాంతిని ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. గంభీర్ స్థానంలో నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ పర్యటనకు తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించి, యువ జట్టును నడిపించనున్నారు.

శ్రీలంక పర్యటనకు కొత్త బౌలింగ్ కోచ్

ఒకవేళ మోర్నీ మోర్కెల్, ర్యాన్ టెన్ డోస్కాట్ ఇద్దరూ జట్టును వీడి వెళ్లాలని నిశ్చయించుకుంటే, బీసీసీఐ చాలా వేగంగా స్పందించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ వెంటనే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఆగస్టు 2026లో జరగబోయే ఈ శ్రీలంక పర్యటనలో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆగస్టు 15న గాలే వేదికగా మొదటి టెస్ట్, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్ట్ జరగనున్నాయి. మోర్కెల్ అందుబాటులో లేకపోతే, ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉన్న భారత మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీని శ్రీలంక టూర్‌కు తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా పంపించే ఆలోచనలో బీసీసీఐ ఉంది.

ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌పైనా వేటు?

వరుస పరాజయాల నేపథ్యంలో కేవలం అసిస్టెంట్, బౌలింగ్ కోచ్‌లు మాత్రమే కాదు, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ పదవిపై కూడా కత్తి వేలాడుతోంది. గత కొంతకాలంగా భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బోర్డు ఆయనపై కూడా అసంతృప్తితో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. మొత్తం మీద గౌతమ్ గంభీర్ కోచింగ్ టీమ్‌లోని కీలక సభ్యులు తప్పుకోవడానికి సిద్ధమవడం, మరికొందరిపై బోర్డు వేటు వేయాలని భావిస్తుండటంతో రాబోయే రోజుల్లో భారత సపోర్ట్ స్టాఫ్ పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us