204 మ్యాచ్‌ల్లో 572 వికెట్లు.. కట్ చేస్తే.. ఈ టీమిండియా బౌలర్ 6 ఏళ్లు జైలు పాలయ్యాడు.. ఎవరంటే?
టీమిండియా మాజీ క్రికెటర్ ఉదయ్ జోషి ఈరోజు 78వ ఏట అడుగుపెట్టాడు. 1944 సంవత్సరంలో డిసెంబర్ 23న రాజ్‌కోట్‌లో జన్మించిన జోషి..
టీమిండియా మాజీ క్రికెటర్ ఉదయ్ జోషి ఈరోజు 78వ ఏట అడుగుపెట్టాడు. 1944 సంవత్సరంలో డిసెంబర్ 23న రాజ్‌కోట్‌లో జన్మించిన జోషి.. భారత జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. అయితేనేం దేశవాళీ క్రికెట్‌లో మాత్రం తనదైన ముద్ర వేశాడు. ప్రస్తుతం అమెరికాలో జోషి నివాసముంటుండగా.. అతడి జీవితంలోని ఓ చీకటి కోణం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
అది ఆగష్టు 1979, ఆ సమయంలో ఇంగ్లాండ్‌లో ససెక్స్ కౌంటీ క్లబ్ తరపున ఉదయ్ జోషి క్రికెట్ ఆడుతున్నాడు. ఇంతలో అతడు స్థానిక క్లబ్ కోసం క్రికెట్ ఆడాలనే ఉద్దేశ్యంతో ఉత్తర ఐర్లాండ్‌కు వెళ్లాడు. అక్కడ అతడిపై వచ్చిన సంచలన ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి. బీబీసీ నివేదిక ప్రకారం, ఈ మాజీ భారత క్రికెటర్ ఉదయ్ జోషి ఉత్తర ఐర్లాండ్‌లో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల నేపధ్యంలో అతడికి 6 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అనంతరం తనపై వచ్చిన ఆరోపణలను నిరాధారమైనవని అభివర్ణిస్తూ, తాను నిర్దోషినని పేర్కొంటూ ఉదయ్ జోషి అప్పీలు దాఖలు చేశారు. ఆ తర్వాత కొద్దికాలానికి ఈ విషయం సద్దుమణిగింది గానీ అతడిపై పడిన మరక మాత్రం అలానే ఉండిపోయింది.
18 సంవత్సరాలు, 4 జట్లు, 204 మ్యాచ్‌లు, 572 వికెట్లు
భారత క్రికెటర్ ఉదయ్ జోషి 1965 నుంచి 1983 మధ్య గుజరాత్, రైల్వేస్, ససెక్స్, సౌరాష్ట్ర జట్ల తరపున దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఈ 4 జట్లతో మొత్తంగా 204 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 186 ఫస్ట్ క్లాస్ క్రికెట్, 18 లిస్ట్ A మ్యాచ్‌లు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడి ఖాతాలో 557 వికెట్లు, 1 సెంచరీతో 2287 పరుగులు ఉన్నాయి. ఇక లిస్ట్-ఎ క్రికెట్‌లో 15 వికెట్లు తీశాడు. బ్యాట్‌తో 57 పరుగులు సాధించాడు. కాగా, డిసెంబర్ 23న 78 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రికెటర్ ఉదయ్ జోషి ప్రస్తుతం అమెరికాలోని నార్త్ కరోలినాలో నివసిస్తున్నారు.