Vaibhav Suryavanshi: ఇదెక్కడి అభిమానం రా బుడ్డోడా.. పృథ్వీ షా తమ్ముడిలా మారొద్దంటూ హెచ్చరిక..

Prithvi Shaw vs Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి అపారమైన ప్రతిభ ఉంది అనడంలో సందేహం లేదు. అతను భారత క్రికెట్ భవిష్యత్తుకు ఒక ఆశాదీపం. అయితే, పృథ్వీ షా విషయంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా, వైభవ్ తన ఆటపై దృష్టి సారించి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Vaibhav Suryavanshi: ఇదెక్కడి అభిమానం రా బుడ్డోడా.. పృథ్వీ షా తమ్ముడిలా మారొద్దంటూ హెచ్చరిక..
Vaibhav Suryavanshi

Updated on: Jul 16, 2025 | 6:43 PM

Vaibhav Suryavanshi: భారత క్రికెట్‌లో ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న యువ సంచలనాల్లో వైభవ్ సూర్యవంశి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేవలం 13 సంవత్సరాల వయసులో IPL 2025 వేలంలో రూ. 1.1 కోట్ల భారీ మొత్తానికి ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాగే తుఫాన్ బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలో సూర్యవంశీ 7 మ్యాచ్‌లలో 252 పరుగులు చేశాడు, అదే సమయంలో IPL చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారతీయుడిగా కూడా నిలిచాడు. అతను కేవలం 35 బంతుల్లోనే ఈ ఘనతను సాధించాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత సూర్యవంశీ అండర్-19 క్రికెట్‌లో తన ఆటతో మరింత దూకుడు పెంచాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లో వరుసగా 48, 45, 86, 143, 33 పరుగులతో మెరిశాడు. ఆ తర్వాత ఆ జట్టుతో జరిగిన మొదటి యూత్ టెస్ట్‌లో 14, 56 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

అయితే, అతని ఎదుగుదల వేగంగా ముందుకు సాగుతుండడంతో, కొందరు క్రికెట్ అభిమానులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతని కెరీర్ పృథ్వీ షా లాగా ముగిసిపోకూడదని హెచ్చరిస్తున్నారు.

పృథ్వీ షా కూడా ఒకప్పుడు ఇలాగే భారత క్రికెట్‌లో యువ సంచలనంగా దూసుకొచ్చాడు. అండర్-19 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా జట్టును విజేతగా నిలిపాడు. ఆ తర్వాత టెస్ట్ అరంగేట్రంలోనే సెంచరీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే, క్రమంగా క్రమశిక్షణారాహిత్యం, ఫిట్‌నెస్ సమస్యలు, మైదానం వెలుపల వివాదాలతో షా కెరీర్ గాడి తప్పింది. ఒకప్పుడు టీమిండియా భవిష్యత్తు స్టార్‌గా భావించిన షా, ఇప్పుడు జాతీయ జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశికి కూడా ఇలాంటి పరిస్థితే రాకూడదని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో అతనికి వస్తున్న ప్రచారం, మీడియా ఫోకస్ చూసి కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “పృథ్వీ షాకు వచ్చిన గతి వైభవ్ సూర్యవంశికి రాకూడదు,” “ఇంత చిన్న వయసులో ఇంత అభిమానం, భవిష్యత్తులో ఆటతీరుపై చెడు ప్రభావం చూపుతుంది. మనం పృథ్వీ షా ఉదాహరణ చూశాం” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవలే ఇంగ్లండ్‌లో జరిగిన యువ వన్డే, టెస్ట్ సిరీస్‌లలో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన చేశాడు. బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ సత్తా చాటాడు. అయితే, అతని ప్రజాదరణ పెరుగుతున్న కొద్దీ, అది అతని ఆటపై ప్రభావం చూపుతుందేమోనని కొందరు కలవరపడుతున్నారు.

ఈ విషయమై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా స్పందించారు. వైభవ్ సూర్యవంశికి ఎన్నో ఎండార్స్‌మెంట్ ఆఫర్లు వస్తున్నాయని, అయితే రాహుల్ ద్రవిడ్ లాంటి అనుభవజ్ఞులు అతన్ని గ్రౌండెడ్‌గా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. చిన్న వయసులో వచ్చే కీర్తి, డబ్బులను సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే కెరీర్‌కు నష్టం వాటిల్లుతుందని శాస్త్రి పరోక్షంగా హెచ్చరించారు. భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా వైభవ్ సూర్యవంశి మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, అంచనాలను తట్టుకోవడం నేర్చుకోవాలని సూచించారు.

వైభవ్ సూర్యవంశీకి అపారమైన ప్రతిభ ఉంది అనడంలో సందేహం లేదు. అతను భారత క్రికెట్ భవిష్యత్తుకు ఒక ఆశాదీపం. అయితే, పృథ్వీ షా విషయంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా, వైభవ్ తన ఆటపై దృష్టి సారించి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాల మార్గదర్శకత్వంలో వైభవ్ తన కెరీర్‌ను సరైన దిశలో నిర్మించుకుంటాడని ఆశిద్దాం.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..