
ఎన్నో ఆశలతో టీమిండియా తరపున అరంగేట్రం చేసి.. కేవలం ఒక్క మ్యాచ్‌తోనే కనుమరుగైన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు విదర్భ మాజీ కెప్టెన్ ఫైజ్ ఫజల్. 2016లో జింబాబ్వేపై భారత్ తరపున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఫజల్.. అరంగేట్రం మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసి సత్తా చాటాడు. అయితే దురదృష్టవశాత్తూ అదే అతడికి అంతర్జాతీయ క్రికెట్‌లో చివరి మ్యాచ్ అయింది. తన అరంగేట్ర మ్యాచ్‌లో ఫజల్ ఆకట్టుకున్నప్పటికీ.. అతడికి ఆ తర్వాత భారత్ జట్టులో ఎలాంటి అవకాశాలు రాలేదు. కానీ దేశవాళీ క్రికెట్‌లో ఫజల్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఫజల్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. 2023-24 రంజీ సీజన్‌లో హర్యానాతో మ్యాచ్ ముగిసిన తర్వాత.. పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా క్రిక్‌ఇన్ఫో ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫజల్.. టీమిండియా తరపున కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడటంపై స్పందించాడు. తొలి మ్యాచ్‌లో రాణించినప్పటికీ.. తనకు ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో చాలా బాధపడ్డానని ఫజల్ తెలిపాడు. తాను చాలా సెన్సిటివ్ అని.. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా బాధపడుతుంటానని పేర్కొన్నాడు. అయితే అదే చిన్న విషయాల వల్ల తాను సంతోషపడిన సందర్బాలు లేకపోలేదన్నాడు ఫజల్. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాకి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడంతో.. తను చాలా గర్వపడటమే కాకుండా.. ఫ్యామిలీ కూడా ఎంతగానో సంతోషపడిందని చెప్పుకొచ్చాడు.
‘కానీ ఆ ఒక్క మ్యాచ్‌తోనే నా సంతోషమంతా ఆవిరైపోయింది. నా కెరీర్ వెనక్కి తిరిగి చూసుకుంటే.. కేవలం ఒక్క మ్యాచ్ కనిపిస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో ఎన్నో అద్భుతాలు చేసినా.. తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయాను. మరో ఛాన్స్ కూడా దక్కలేదు. ఆ సమయంలో ఎంతగానో ఫీలయ్యాను. అలాగే అప్పటి జట్టులో నేను ఒక్కడినే ఐపీఎల్‌లో కూడా ఆడలేదని’ ఫజల్ తెలిపాడు.
మరోవైపు ధోనితో జరిగిన ఓ ఇన్సిడెంట్‌ను కూడా పంచుకున్నాడు ఫజల్. హరారే మ్యాచ్ అనంతరం తిరిగి వస్తుండగా.. ధోనికి ఎయిర్‌పోర్ట్ లౌంజ్‌లో కూర్చునేందుకు తమ సీట్ ఆఫర్ చేయగా.. అతడు సున్నితంగా దాన్ని తిరస్కరించి.. నేల మీద కూర్చున్నాడని.. అంతటి లెజండరీ బ్యాటర్ ఎలాంటి అహంకారం లేకుండా ఇతర ప్లేయర్స్ సౌకర్యంగా ఉండేలా చూసుకుంటాడని ప్రశంసించాడు ఫజల్.