ధోనిని మేం ఎప్పుడూ అడగలే.. రోకోలపైనే టార్గెట్ ఎందుకు: గంభీర్, అగార్కర్‌లకు మాస్ వార్నింగ్
ప్రస్తుతం జట్టులో యువ ఆటగాళ్ల కంటే రోహిత్, కోహ్లీనే అద్భుతంగా రాణిస్తున్నారని ప్రసాద్ గుర్తుచేశారు. "వారి మనసులను పాడుచేయకూడదు. జాతీయ జట్టుకు ఆడని సమయంలో వారు దేశవాళీ క్రికెట్ ఆడితే అది యువ ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుంది. కానీ వారిపై అనవసరమైన ఒత్తిడి తేవడం సరికాదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

MS Dhoni: టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై ఒత్తిడి తేవద్దని బీసీసీఐ (BCCI) మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె. ప్రసాద్ ప్రస్తుత సెలెక్షన్ కమిటీకి సూచించారు. దేశవాళీ క్రికెట్ ఆడాలంటూ ఈ ఇద్దరి స్టార్ ఆటగాళ్ల మనసులను గందరగోళానికి గురిచేయవద్దని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీకి ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు.
టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్, కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి సారించారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేకు ముందు, సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలంటూ సెలెక్టర్లు కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే, మైదానంలో కోహ్లీ సెంచరీతో, రోహిత్ అర్ధ సెంచరీతో రాణించి తమ నిబద్ధతను చాటుకున్నారు.
ఈ నేపథ్యంలో ఎం.ఎస్.కె. ప్రసాద్ స్పందిస్తూ.. “మేం ఎం.ఎస్. ధోనిని ఎప్పుడూ దేశవాళీ క్రికెట్ ఆడమని అడగలేదు. ఆయనకు అవసరమనిపించినప్పుడు ఆయనే ఆడేవారు. ఇలాంటి విషయాల్లో స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండాలి. అంతేకానీ, ప్రతిసారీ ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి వారిని ఇబ్బంది పెట్టకూడదు” అని అన్నారు.
ప్రస్తుతం జట్టులో యువ ఆటగాళ్ల కంటే రోహిత్, కోహ్లీనే అద్భుతంగా రాణిస్తున్నారని ప్రసాద్ గుర్తుచేశారు. “వారి మనసులను పాడుచేయకూడదు. జాతీయ జట్టుకు ఆడని సమయంలో వారు దేశవాళీ క్రికెట్ ఆడితే అది యువ ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుంది. కానీ వారిపై అనవసరమైన ఒత్తిడి తేవడం సరికాదు” అని ఆయన అభిప్రాయపడ్డారు.
మ్యాచ్ సన్నద్ధత గురించి కోహ్లీ మాట్లాడుతూ.. “నేను ఎప్పుడూ శారీరక శ్రమను నమ్ముతాను. మానసికంగా సిద్ధంగా ఉన్నానంటే చాలు, ఆటపై దృష్టి పెట్టగలను. క్రికెట్ కోసం ప్రత్యేకంగా ప్రిపరేషన్ అవసరమని నేను భావించను” అని పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ కూడా ఇటీవలి కాలంలో 10 కిలోల బరువు తగ్గి, 2027 ప్రపంచకప్‌కు సిద్ధమనే సంకేతాలిచ్చారు. సీనియర్ల ప్రదర్శన, ఫిట్‌నెస్ చూస్తుంటే వారిపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని మాజీ సెలెక్టర్ స్పష్టం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








