IND vs ENG: సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ! గాయంతో స్టార్‌ ప్లేయర్‌ దూరం!

|

Nov 07, 2022 | 2:45 PM

కీలకమైన సెమీస్‌కు ముందు బట్లర్‌ సేనకు ఎదురుదెబ్బ తగిలింది. టీ20 స్పెషలిస్ట్‌ డేవిడ్‌ మలన్‌ బిగ్‌ మ్యాచ్‌ నుంచి తప్పుకునే అవకాశాలున్నాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 10 బ్యాటర్లలో ఉన్న ఏకైక ఇంగ్లిష్‌ ప్లేయర్‌ మలన్.

IND vs ENG: సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ! గాయంతో స్టార్‌ ప్లేయర్‌ దూరం!
England Cricket
Follow us on

టీ20 ప్రపంచకప్ 2022 కీలక దశకు చేరుకుంది. రెండు గ్రూప్‌ల నుంచి బలమైన జట్లు నాకౌట్‌కు చేరుకున్నాయి. బుధవారం జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్, పాక్‌ తలపడనున్నాయి. అలాగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ గురువారం అడిలైడ్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు గ్రూప్ 2లో టాపర్‌గా నిలిచింది. అదే సమయంలో ఇంగ్లిష్ జట్టు గ్రూప్ 1లో రెండో స్థానంలో నిలిచింది. కాగా కీలకమైన సెమీస్‌కు ముందు బట్లర్‌ సేనకు ఎదురుదెబ్బ తగిలింది. టీ20 స్పెషలిస్ట్‌ డేవిడ్‌ మలన్‌ బిగ్‌ మ్యాచ్‌ నుంచి తప్పుకునే అవకాశాలున్నాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 10 బ్యాటర్లలో ఉన్న ఏకైక ఇంగ్లిష్‌ ప్లేయర్‌ మలన్. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో అతనికి బోలెడు అనుభవం ఉంది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మలన్‌ గాయపడ్డాడు. ప్రస్తుతం అతను వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు, భారత జట్టుతో ఆడే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

సెమీఫైనల్‌కు ఇంకా సమయం ఉన్నా మలన్ గాయాన్ని చూస్తుంటే సకాలంలో కోలుకునేలా కనిపించడం లేదు. అతను చాలా ఇబ్బంది పడుతున్నాడని అయితే మ్యాచ్‌కల్లా మలన్ కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు ఆదిల్ రషీద్. ఇక మలన్ విషయానికొస్తే.. ఈ ప్రపంచ కప్‌లో అతను సూపర్‌ ఫామ్‌లో కనిపించాడు. అయితే అతనికి బ్యాటింగ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆఫ్ఘనిస్తాన్‌పై కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత ఐర్లాండ్‌పై 35 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌పై 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాటర్లలో ఒకరైన మలన్‌కు భారతజట్టుపై కూడా ఘనమైన రికార్డులు ఉన్నాయి. జులైలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌లో భారత్‌పై మలన్ 77 పరుగులు చేశాడు. గతేడాది అహ్మదాబాద్‌ మ్యాచ్‌లోనూ 68 పరుగులు చేశాడు. ఈనేపథ్యంలో కీలక మ్యాచ్‌కు మలన్‌ దూరం కావడం ఇంగ్లిష్‌ జట్టుకు ఎదురుదెబ్బేనని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..