
అతడు అనుభవం ఉన్న ఆటగాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు పలు అంతర్జాతీయ మ్యాచుల్లోనూ ఇండియా తరుపున మ్యాజికల్ ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్ కీపింగ్‌లోనూ ఆరితేరినవాడు. ఇప్పటికే అతడెవరో మీకు అర్థమైవుంటుంది. దినేశ్ కార్తీక్..ఆనపకాయంత టాలెంట్ ఉన్నా కూడా ఆవగింజంత లక్ కలిసిరాక ఇప్పటివరకు అతడు వరల్డ్ కప్ మ్యాచుల్లో ఆడలేకపోయాడు. తాజా వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా మంగళవారం జరుగుతున్న వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అనూహ్యంగా తుది జట్టులో రెండు మార్పులు చేశాడు. టోర్నీ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న కేదార్ జాదవ్‌పై వేటు వేసిన కోహ్లి.. అతని స్థానంలో దినేశ్ కార్తీక్‌కి అవకాశమిచ్చాడు. 2007 ప్రపంచకప్ తర్వాత దీనేశ్ కార్తీక్ మళ్లీ వరల్డ్‌కప్‌లో ఆడుతుండటం ఇదే తొలిసారి.
దినేశ్ కార్తీక్ క్రికెట్ మక్కా లార్డ్స్‌లో 2004లో వన్డే క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. 2007 ప్రపంచకప్‌నకు అతడిని ఎంపిక చేసినప్పటికీ భారత్ ఆడిన 3 మ్యాచుల్లో చోటు దక్కలేదు. టీమిండియా పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. 2011, 2015 ప్రపంచకప్‌లకు ధోని అద్భుత ప్రదర్శన చేస్తుండటంతో కార్తీక్ ఆడేందుకు అవకాశం కుదరలేదు.
ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో మంచి ప్రదర్శనతో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్న కార్తీక్‌ని ప్రపంచకప్‌కి సెలక్టర్లు ఎంపిక చేయడం మంచి విషయమే. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని పక్కనపెట్టిన సెలక్టర్లు.. సీనియర్ ఆటగాడైన కార్తీక్‌ని రెండో వికెట్ కీపర్‌గా టీమ్‌లోకి తీసుకోవడంతో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయినా కూాడా ప్రస్తుత వరల్డ్ కప్‌లో భారత్ జట్టు ఏడు మ్యాచ్‌లాడినా.. అతనికి మాత్రం తుది జట్టులో చోటు లభించలేదు. తాజాగా కేదార్ జాదవ్ వరుసగా 9, 52, 7, 12 పరుగులతో నిరాశపరచడంతో దినేశ్ కార్తీక్‌కి అవకాశం దక్కింది. మొత్తంగా 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఓ ఆటగాడు ప్రపంచకప్‌లో ఆడటం గ్రేట్ అనే చెప్పాలి. క్రేజీ విషయం ఏంటంటే శిఖర్ ధావన్, విజయ్ శంకర్‌లకు గాాయాలతో పంత్ కూడా నేటి మ్యాచ్‌లో భారత్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.