Delhi Capitals : ఢిల్లీ క్యాపిటల్స్‌లో ప్రక్షాళన.. అక్షర్ కెప్టెన్సీకి ఎసరు.. కోచింగ్ స్టాఫ్ మొత్తం అవుట్?

Delhi Capitals : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్షర్ పటేల్ కెప్టెన్సీతో పాటు కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని మార్చే అవకాశం ఉంది.ఈ సీజన్‌లో అక్షర్ పటేల్ అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు నాయకత్వంలోనూ ఆకట్టుకోలేకపోయారు.

Delhi Capitals : ఢిల్లీ క్యాపిటల్స్‌లో ప్రక్షాళన.. అక్షర్ కెప్టెన్సీకి ఎసరు.. కోచింగ్ స్టాఫ్ మొత్తం అవుట్?
Delhi Capitals (2)

Updated on: May 15, 2026 | 10:57 AM

Delhi Capitals : ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టులో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ సీజన్‌లో వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గాలిలో దీపంలా మారడంతో, యాజమాన్యం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. వచ్చే సీజన్ నాటికి ఢిల్లీ కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని సాగనంపే అవకాశం ఉంది. అంతేకాకుండా కెప్టెన్ అక్షర్ పటేల్ తన పదవిని కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

అక్షర్ కెప్టెన్సీపై అసంతృప్తి

ఈ సీజన్‌లో అక్షర్ పటేల్ అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు నాయకత్వంలోనూ ఆకట్టుకోలేకపోయారు. 9 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 100 పరుగులు మాత్రమే చేసిన అక్షర్, స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువగా (112.50) ఉంది. బౌలింగ్‌లో కూడా కీలక సమయంలో తనను తాను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం, నిర్ణయాల కోసం హేమంగ్ బదాని, వేణుగోపాల్ రావుపై ఎక్కువగా ఆధారపడటం యాజమాన్యానికి నచ్చలేదని సమాచారం. ఈ వైఫల్యాల నేపథ్యంలో వచ్చే ఏడాది అక్షర్ కెప్టెన్‌గా కొనసాగడం అసాధ్యమనే వార్తలు వినిపిస్తున్నాయి.

మారనున్న మేనేజ్మెంట్ పగ్గాలు..

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఒక ప్రత్యేకమైన ఒప్పందం ఉంది. దీని ప్రకారం JSW, GMR గ్రూపులు మార్చి మార్చి క్రికెట్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయి. వచ్చే సీజన్ నుంచి పార్థ్ జిందాల్ నేతృత్వంలోని JSW గ్రూప్ పగ్గాలు చేపట్టనుంది. జిందాల్ గతంలోనే జట్టు ఎంపిక, కోచింగ్ విషయంలో చాలా సీరియస్‌గా ఉంటారని పేరుంది. అందుకే ప్రస్తుత కోచింగ్ బృందం మొత్తాన్ని తొలగించి సరికొత్త టీమ్‌ను రంగంలోకి దించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

తప్పుడు నిర్ణయాలే కొంపముంచాయా?

అభిషేక్ పోరెల్ వంటి మెరుపు ఆటగాడిని పక్కన పెట్టడం, ఆల్ రౌండర్ మాధవ్ తివారీని సరిగ్గా వాడకపోవడం వంటి నిర్ణయాలు జట్టు విజయావకాశాలను దెబ్బతీశాయి. యువ ఆటగాడు సాహిల్ పరాఖ్‌ను నేరుగా బరిలోకి దించి ఒత్తిడి పెంచడం కూడా విమర్శలకు దారితీసింది. 2027లో మెగా వేలం జరగనున్న నేపథ్యంలో.. అక్షర్‌ను ఒక ప్లేయర్‌గా అంటిపెట్టుకున్నా, నాయకత్వ బాధ్యతలు మాత్రం మరొకరికి అప్పగించే యోచనలో ఢిల్లీ యాజమాన్యం ఉంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us