
DC vs KKR : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దిశగా దూసుకుపోతున్న తరుణంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన 51వ ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ అలవోకగా ఛేదించింది. ఫిన్ అలెన్ వీరబాదుడుతో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుని, ఈ సీజన్‌లో వరుసగా నాలుగో గెలుపును తన ఖాతాలో వేసుకుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా బౌలర్ల ధాటికి విలవిలలాడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాటర్లలో ఆశుతోష్ శర్మ (39), పథుమ్ నిస్సాంక (50) మినహా మిగిలిన వారెవరూ కనీస పోరాటం చేయలేకపోయారు. ముఖ్యంగా కేకేఆర్ బౌలర్లు కార్తీక్ త్యాగి, వైభవ్ అరోరా తమ కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఢిల్లీని కట్టడి చేశారు. అక్షర్ పటేల్ వంటి స్టార్ బ్యాటర్ కూడా బౌండరీ కొట్టడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది.
143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఆరంభంలో చిన్నపాటి షాక్ తగిలింది. కెప్టెన్ అజింక్య రహానే (రన్ అవుట్), అంగ్‌క్రిష్ రఘువంశీ (1) వెంటనే పెవిలియన్ చేరారు. అయితే, ఓపెనర్ ఫిన్ అలెన్ అస్సలు తగ్గలేదు. మిచెల్ స్టార్క్ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచి కేవలం 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో 10 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఫిన్ అలెన్ విధ్వంసానికి తోడు కేమరూన్ గ్రీన్ అండగా నిలవడంతో కేకేఆర్ విజయం నల్లేరు మీద నడకలా సాగింది.
కేకేఆర్ బ్యాటర్లు ఏమాత్రం కనికరం చూపకుండా ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశారు. కేవలం 14.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసి లక్ష్యాన్ని చేరుకున్నారు. అంటే మరో 34 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ విజయఢంకా మోగించింది. ఈ గెలుపుతో కేకేఆర్ నెట్ రన్ రేట్ కూడా భారీగా మెరుగుపడింది. ఢిల్లీ బౌలర్లు కుల్దీప్, స్టార్క్ వంటి వారు ఉన్నప్పటికీ కేకేఆర్ జోరును ఆపలేకపోయారు.
ఈ విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత, వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి కేకేఆర్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. మరోవైపు, ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీకి ఇది 6వ ఓటమి కావడం గమనార్హం.