అయోధ్య రామమందిరంలో రామ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాన మంత్రి మోడీ చేతుల మీదుగా సాగిన ఈ మహా క్రతువుకు దేశ, విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో పలువురు క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారు. సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, వెంకటేశ్ ప్రసాద్, అనిల్ కుంబ్లేతోపాటు మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ అయోధ్య రామోత్సవానికి హాజరయ్యారు. వీరితో పాటు భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, మాజీ అథ్లెట్ పీటీ ఉష, ఒలింపిక్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్ సైతం అయోధ్యకు వెళ్లారు. ధోనీ, రోహిత్, అశ్విన్‌లకు సైతం ఆహ్వానాలు అందినా వ్యక్తిగత కారణాలతో అయోధ్యకు వెళ్లలేకపోయారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ రామ భక్తిని చాటుకున్నాడు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వేళ ‘జై శ్రీరామ్’ అంటూ భారతీయులందరికీ తన అభినందన సందేశాన్ని అందించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో శ్రీరామచంద్రుడి రాక ఫొటోను షేర్ చేసిన వార్నర్.. జై శ్రీరాం ఇండియా అని రాశారు. ఇప్పుడు డేవిడ్ వార్నర్ పోస్ట్‌కు చాలా ప్రశంసలు వస్తున్నాయి.
డేవిడ్ వార్నర్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీ ఆడుతున్నాడు. యూఏఈలో జరుగుతున్న ఈ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి చెందిన దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు వార్నర్ నాయకత్వం వహిస్తున్నాడు. అలాగే, వార్నర్ రాబోయే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. డేవిడ్ వార్నర్ ఇప్పటికే వన్డే, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సిడ్నీలో పాకిస్థాన్‌తో జరిగిన చివరి టెస్టు మ్యాచ్ ద్వారా వార్నర్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. టెస్టు క్రికెట్ చివరి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వార్నర్ (57) తన చివరి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ అర్ధ సెంచరీతో ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా తరఫున 203 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన డేవిడ్ వార్నర్ ఓపెనర్‌గా మొత్తం 8786 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డుకు వార్నర్ గుడ్ బై చెప్పాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..