SA vs NZ: మా ఓటమికి భారత జట్టే కారణం.. డేవిడ్ మిల్లర్ షాకింగ్ కామెంట్స్..

David Miller Key Comments: 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఫైనల్ ఆడే కలను మరోసారి నెరవేర్చుకోకుండానే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో డేవిడ్ మిల్లర్ విమర్శలు గుప్పించాడు. టీమిండియాతోపాటు, ఐసీసీకి గట్టిగానే ఇచ్చి పడేశాడు.

SA vs NZ: మా ఓటమికి భారత జట్టే కారణం.. డేవిడ్ మిల్లర్ షాకింగ్ కామెంట్స్..
Sa Vs Nz David Miller

Updated on: Mar 06, 2025 | 11:13 AM

SA vs NZ: ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి లీగ్ దశ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా దక్షిణాఫ్రికా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సెమీఫైనల్‌కు చేరుకుంది. అప్పటి వరకు పాకిస్తాన్‌లో ఆడిన సౌతాఫ్రికా జట్టు.. ఆ తర్వాత, టీమిండియాతో సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను ఆడాల్సి వస్తుందేమోనని ప్రాక్టీస్ చేయడానికి దుబాయ్ వెళ్ళింది. ఎందుకంటే, టీమిండియా తన మ్యాచ్‌లను కేవలం దుబాయ్‌లోనే ఆడుతోంది. సౌతాఫ్రితాపాటు ఆస్ట్రేలియా జట్టు కూడా పాకిస్తాన్ నుంచి దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. కానీ, దుబాయ్ మైదానంలో టీం ఇండియా న్యూజిలాండ్‌ను ఓడించడంతో ఆస్ట్రేలియా జట్టు దుబాయ్‌లోనే ఉండిపోయింది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా రెండవ సెమీ-ఫైనల్ ఆడటానికి పాకిస్తాన్‌లోని లాహోర్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. ఇలా పాక్ నుంచి దుబాయ్‌కి, మరలా దుబాయ్ నుంచి పాకిస్తాన్‌కు తిరిగాల్సి రావడంతో డేవిడ్ మిల్లర్ విచారం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండవ సెమీస్‌లో సౌతాఫ్రికా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కేవలం భారత జట్టు వల్లే ఓడిపోయామనేలా డేవిడ్ మిల్లర్ తన బాధను వ్యక్తం చేశాడు.

డేవిడ్ మిల్లర్ విచారం..

సెమీ-ఫైనల్లో దక్షిణాఫ్రికా తరపున డేవిడ్ మిల్లర్ సెంచరీ చేశాడు. కానీ అతని జట్టు 362 పరుగుల ఛేదనలో 312 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 50 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తరువాత ఐసీసీ షెడ్యూల్ గురించి మిల్లర్ మాట్లాడుతూ.. ఇక్కడి నుంచి (పాకిస్తాన్ కు) కేవలం గంటా 40 నిమిషాల విమాన ప్రయాణం. మ్యాచ్ ఆడిన తర్వాత, మేం మరుసటి రోజు తెల్లవారుజామున దుబాయ్‌కి విమానంలో బయలుదేరాం. అక్కడికి వెళ్ళిన తర్వాత, మరుసటి రోజు ఉదయం విమానంలో పాకిస్తాన్‌కు తిరిగి వచ్చాం. మేం విమానంలో ఐదు గంటలు గడిపినట్లు కాదు. కోలుకోవడానికి మాకు తగినంత సమయం లేదు. దాంతో మాకు తగినంత ప్రాక్టీస్ చేసేంత సమయం కూడా లేకుండా పోయింది’ అంటూ విమర్శలు గుప్పించాడు.

50 పరుగుల తేడాతో ఓటమిపై మిల్లర్ మాట్లాడుతూ.. మేం నిజంగా బాగా ఆడాం. మా పునాది చాలా బాగుంది. దురదృష్టవశాత్తు మేం మధ్య ఓవర్లలో చాలా వికెట్లు కోల్పోయాం. చివరికి ఇది ఒక జట్టు కృషి. అందరూ తమ శక్తి మేరకు కృషి చేయడానికి ప్రయత్నించారు. మళ్ళీ భారత్‌తో ఆడితే బాగుండేది. ట్రోఫీ గెలవాలంటే చాలా కష్టపడాలి’ అంటూ తెలిపాడు.

దుబాయ్ బయలుదేరిన న్యూజిలాండ్ జట్టు..

దక్షిణాఫ్రికా జట్టు గురించి మాట్లాడుకుంటే, దాని ప్రయాణం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమితో ముగిసింది. అదే సమయంలో, లాహోర్‌లో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత, న్యూజిలాండ్ జట్టు ఇప్పుడు టీమ్ ఇండియాతో ఫైనల్ మ్యాచ్ ఆడటానికి దుబాయ్‌కి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, కివీస్ జట్టుకు మూడు రోజుల సమయం ఉంది. దీని కారణంగా న్యూజిలాండ్ జట్టు దుబాయ్ వెళ్లి కఠినంగా ప్రాక్టీస్ చేస్తుంది. భారతదేశానికి బలమైన పోటీ అందించాలనుకుంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..