మైదానాలకు రానేరాం.. మ్యాచ్‌లు ఆడనే ఆడం: బంగ్లాదేశ్‌లో ముదిరిన సంక్షోభం
Bangladesh Premier League 2026 controversy: ఆటగాళ్ల పట్ల బోర్డు ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు బంగ్లాదేశ్ క్రికెట్ ప్రతిష్టను దెబ్బతీశాయి. టీ20 వరల్డ్ కప్ 2026 దగ్గరపడుతున్న తరుణంలో ఇలాంటి అంతర్గత విభేదాలు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమస్యకు బోర్డు ఎలాంటి ముగింపు పలుకుతుందో వేచి చూడాలి.

Bangladesh Premier League 2026 Controversy: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), ఆటగాళ్ల మధ్య నెలకొన్న వివాదం గురువారం ముదిరి పాకాన పడింది. మిర్పూర్‌లో జరగాల్సిన చట్టోగ్రామ్ రాయల్స్ వర్సెస్ నోవాఖాలీ ఎక్స్‌ప్రెస్ మధ్య మ్యాచ్ టాస్ సమయంలో వింత పరిస్థితి నెలకొంది. రెండు జట్ల కెప్టెన్లు మైదానంలోకి రాకపోవడంతో మ్యాచ్ రిఫరీ షిపార్ అహ్మద్ ఒక్కరే మైదానంలో నిలబడాల్సి వచ్చింది.
వివాదానికి అసలు కారణం ఏమిటి..?
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఎం. నజ్ముల్ ఇస్లాం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఈ సంక్షోభానికి మూలకారణం. మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ను ఆయన ‘ఇండియన్ ఏజెంట్’ అని సంబోధించడమే కాకుండా, ఆటగాళ్లపై బోర్డు ఖర్చు చేస్తున్న డబ్బుకు తగిన ఫలితాలు రావడం లేదని, వారు విఫలమైతే ఆ డబ్బును తిరిగి వసూలు చేయాలంటూ వ్యాఖ్యానించారు.
ఆటగాళ్ల ఐక్య పోరాటం..
క్రిక్కెటర్ల సంక్షేమ సంఘం (CWAB) అధ్యక్షుడు మొహమ్మద్ మిథున్ ఆధ్వర్యంలో ఆటగాళ్లందరూ ఏకమయ్యారు. నజ్ముల్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేసే వరకు దేశవ్యాప్తంగా ఏ రూపంలోనూ క్రికెట్ ఆడబోమని ప్రకటించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం జరగాల్సిన ఢాకా క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు రద్దయ్యాయి. బీపీఎల్ 2026 మ్యాచ్‌లకు ఆటగాళ్లు గైర్హాజరయ్యారు. నజ్ముల్ ఇస్లాం స్వచ్ఛందంగా తప్పుకోవాలని, లేదంటే నిరసనలు కొనసాగుతాయని మిథున్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: CSK Franchise: ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. సీజన్ మొత్తానికి చెన్నై కెప్టెన్ దూరం..
బీసీబీ స్పందన..
పరిస్థితి తీవ్రతను గమనించిన బీసీబీ, నజ్ముల్ ఇస్లాంకు ‘షోకాజ్’ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే, బోర్డు రాజ్యాంగం ప్రకారం ఒక డైరెక్టర్‌ను బలవంతంగా తొలగించడం కష్టమని అధికారులు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు ప్రతిష్టంభనకు దారితీస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




