Test Twenty : టెస్ట్ క్రికెట్+టీ20 ఫార్మాట్‌ల కలయికతో టెస్ట్ ట్వంటీ లాంచ్.. తొలి సీజన్ 2026 జనవరిలోనే
టెస్ట్ ట్వంటీ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి 80 ఓవర్ల ఫార్మాట్గా నిలవనుంది. ఇందులో ప్రతి జట్టుకు ఒకేసారి 40 ఓవర్లు ఆడటానికి బదులుగా.. 20-20 ఓవర్ల చొప్పున రెండు ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం లభిస్తుంది. అంటే, టెస్ట్ మ్యాచ్‌లో మాదిరిగానే ప్రతి జట్టు రెండుసార్లు బ్యాటింగ్ చేస్తుంది.

Test Twenty : క్రికెట్‌లో రోజురోజుకు కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ క్రీడా వినోదాన్ని మరింత పెంచే ఉద్దేశ్యంతో ఒక సరికొత్త ఫార్మాట్‌కు శ్రీకారం చుట్టారు. అదే టెస్ట్ ట్వంటీ. ఈ ఫార్మాట్‌లో టెస్ట్ క్రికెట్ లోతైన వ్యూహాలను, టీ20 క్రికెట్ వేగం, ఉత్సాహంతో మిళితం చేయనున్నారు. ఈ కొత్త ఫార్మాట్ సలహాదారుల బోర్డులో వెస్టిండీస్ దిగ్గజం సర్ క్లైవ్ లాయిడ్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడన్, టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ వంటి ప్రముఖులు ఉన్నారు.
టెస్ట్ ట్వంటీ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి 80 ఓవర్ల ఫార్మాట్గా నిలవనుంది. ఇందులో ప్రతి జట్టుకు ఒకేసారి 40 ఓవర్లు ఆడటానికి బదులుగా.. 20-20 ఓవర్ల చొప్పున రెండు ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం లభిస్తుంది. అంటే, టెస్ట్ మ్యాచ్‌లో మాదిరిగానే ప్రతి జట్టు రెండుసార్లు బ్యాటింగ్ చేస్తుంది. ఈ ఫార్మాట్‌లో టెస్ట్, టీ20 క్రికెట్ రెండింటి నియమాలు అమలు అవుతాయి. ఫలితాలు కూడా సాంప్రదాయ టెస్ట్ క్రికెట్‌లాగే ఉంటాయి. అంటే, గెలుపు, ఓటమి, టై లేదా డ్రా వంటి నాలుగు రకాల ఫలితాలు ఇందులో సాధ్యమవుతాయి.
టెస్ట్ ట్వంటీ మొదటి సీజన్ జనవరి 2026లో ప్రారంభం కానుంది. ఈ తొలి సీజన్‌లో మొత్తం 6 ఫ్రాంచైజీలు పాల్గొంటాయి. ఇందులో మూడు జట్లు భారతదేశం నుండి ప్రాతినిధ్యం వహిస్తాయి. మిగిలిన మూడు జట్లు దుబాయ్, లండన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి ఆడతాయి. ప్రతి జట్టులో 16 మంది ఆటగాళ్లు ఉంటారు. ఈ కొత్త ఫార్మాట్‌ను ది వన్ వన్ సిక్స్ నెట్‌వర్క్ కార్యనిర్వాహక అధ్యక్షుడు గౌరవ్ బహిర్వాణి రూపొందించారు.
Proud to have launched Test Twenty®️ with @gauravbahirvani . If you’re 13–19 and play with passion, this is your chance. Register: https://t.co/zNFYTDL6lV@The_Test_Twenty @HaydosTweets #clivelloyd @harbhajan_singh #ParitySports #oneonesixnetwork#TestTwenty #FourthFormat pic.twitter.com/FNDYvM6tJf
— AB de Villiers (@ABdeVilliers17) October 16, 2025
ఈ కొత్త ఫార్మాట్‌కు మాజీ క్రికెటర్ల నుంచి విశేష ప్రశంసలు దక్కాయి. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ.. “టెస్ట్ ట్వంటీ క్రికెట్‌లో ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది. అంతేకాక, యువ ఆటగాళ్లకు ఇందులో పూర్తి అవకాశాలు లభిస్తాయి” అని అన్నారు. వెస్టిండీస్ దిగ్గజం సర్ క్లైవ్ లాయిడ్ ఈ ఫార్మాట్‌పై మాట్లాడుతూ.. “క్రికెట్ ఎప్పుడూ మారుతూ, కొత్త రూపాలు సంతరించుకుంటుంది. కానీ టెస్ట్ ట్వంటీ చాలా ఆలోచించి రూపొందించారు” అని అన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




