హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తాలూకు వేడి ఇంకా తగ్గనే లేదు. ఒక్క రన్ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడగొట్టి కప్పును ఎగరేసుకుపోయింది ముంబై ఇండియన్స్ టీమ్. దీంతో కలిపి మొత్తం నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచి గొప్ప క్రెడిట్ సాధించింది. ఇదంతా ఒక ఎత్తయితే.. ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై టీమ్ ఓడిపోయిన తీరుపై ఇప్పటికీ రచ్చ జరుగుతూనే వుంది. ముఖ్యంగా ధోనీ రనౌట్ అంశం.. అభిమానుల్ని పిచ్చెక్కిస్తోంది.
ఆరు నుంచి అరవై దాకా ఆబాల గోపాలాన్ని అలరించేలాంటి కరిష్మాటిక్ బ్యాట్స్‌మెన్ ధోనీ. ప్రత్యేకించి ఈ మ్యాచ్‌లో ధోనీ ఓడిపోయిన విధం.. ఆయన అభిమాన గణానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తమిళనాడుకు చెందిన మూడేళ్ళ బాలుడయితే ఫైనల్ మ్యాచ్ ముగిసినప్పటినుంచీ ఏడుస్తూనే వున్నాడు. అన్నం- నీళ్లు మానేసి ఆ పిల్లగాడు చేస్తున్న మారాం.. ఇప్పుడు సోషల్ మీడియాను తెగ దున్నేస్తోంది. ఏడవకు ఏడవకు చిన్ని నాయనా.. అంటూ అతడి తల్లి సున్నితంగా ఓదార్చబోతే.. వీడు మాత్రం పెద్దపెద్ద మాటలతో పెట్రేగిపోతున్నాడు. ”ధోనీ అవుటే కాలేదు.. ఆ థర్డ్ ఎంపైర్ తప్పుడు డెసిషన్ ఇచ్చాడు. గ్రౌండ్ లోనే ఉరేసుకుని చచ్చిపోవాలి” అంటూ అతడు పెట్టిన శాపనార్ధాలు వినడానికి ముచ్చటగా వున్నాయి. ఈ బుడతడు చెప్పింది నిజమేనంటూ నెటిజన్లు కూడా కోరస్ ఇస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో మోస్ట్ కాంట్రవర్సియల్ డెసిషన్స్‌లో ఇదీ ఒకటి అంటూ ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు.