నేపాల్ ప్రీమియర్ లీగ్ (NPL) 2024లో డిసెంబర్ 16న జరిగిన 28వ మ్యాచ్‌లో సుదుర్పశ్చిమ్ రాయల్స్ కర్నాలీ యాక్స్‌పై ఆధిపత్యం ప్రదర్శించి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. త్రిభువన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని ఖరారు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో జయాపజయాల కంటే మరింతగా చర్చనీయాంశమైన విషయం బినోద్ భండారి చేసిన అద్భుతమైన స్టంపింగ్.
కర్నాలీ యాక్స్ బ్యాటింగ్‌కు దిగినప్పటి నుంచి కష్టాల్లో పడింది. వారి ఇన్నింగ్స్ కేవలం 101 పరుగులకే ముగిసిపోయింది. హర్మీత్ సింగ్ తన స్పిన్ బౌలింగ్‌తో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతను నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీసి కర్నాలీ బ్యాటింగ్ లైనప్‌ను పూర్తిగా దెబ్బతీశాడు. అలాంటి తక్కువ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన సుదుర్పశ్చిమ్ రాయల్స్, కెప్టెన్ దీపేంద్ర సింగ్ ఎయిరీ (38 పరుగులు), ఇషాన్ పాండే (38 పరుగులు) ఆధిక్యంలో కేవలం 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించి విజయం సాధించింది. ఈ విజయంతో రాయల్స్ 12 పాయింట్లతో టాప్ పొజిషన్‌ను పటిష్ఠం చేసుకున్నారు.
మ్యాచ్‌లో అత్యుత్తమ సన్నివేశం మాత్రం బినోద్ భండారి వికెట్ కీపింగ్ నైపుణ్యమే. బిపిన్ శర్మను స్టంపౌట్ చేయడానికి భండారి చూపిన తెలివితేటలు మ్యాచ్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఓవర్ చివరి బంతికి స్పిన్నర్ సింగ్ లెగ్ సైడ్‌కు బంతిని వేయగా, శర్మ దానిని ఆడేందుకు ముందుకు వచ్చి క్రీజు నుంచి బయటికి వెళ్లిపోయాడు. భండారి వెంటనే అప్రమత్తమై తన గ్లౌజ్‌లతో బంతిని కాళ్ల మధ్య అందుకొని వేగంగా స్టంప్స్ ని కొట్టాడు. ఈ క్షణం అభిమానులను MS ధోనీ స్పెషల్ స్టంపింగ్‌లను గుర్తు చేసుకునేలా చేసింది. ఇక్కడ విశేషం ఏంటంటే బినోద్ భండారి కూడా పసుపు జెర్సీ, నంబర్ 7 కూడా మ్యాచ్ అవ్వడం ధోనీ స్టైల్‌కు మరింత పోలికను తీసుకువచ్చింది.
భండారి చేసిన స్టంపింగ్‌పై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. అతని నైపుణ్యం, మేధస్సు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసింది. ఒకవేళ బ్యాటర్ క్రీజులో ఉంటే బంతి ఎటు వెళ్లిందో కూడా తెలియకుండా భండారి తన మనోస్ఫూర్తితో వికెట్‌ను కూల్చడం నిజంగా కీపర్ మాస్టర్ క్లాస్‌గా నిలిచింది.
ఇక ఈ విజయంతో సుదుర్పశ్చిమ్ రాయల్స్ ప్లేఆఫ్‌లో జనక్‌పూర్ బోల్ట్స్‌తో తలపడనున్నారు. మరోవైపు కర్నాలీ యాక్స్, ఎలిమినేటర్ మ్యాచ్‌లో చిత్వాన్ రైనోస్‌తో పోటీపడతారు. అయితే ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన కర్నాలీ యాక్స్ ఈ సీజన్‌లో కీలక ముందడుగు వేసింది.
NPL 2024లో ఇలా మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అయితే బినోద్ భండారి చూపిన వికెట్ కీపింగ్ మాయాజాలం మాత్రం ఈ టోర్నమెంట్‌కి చిరస్మరణీయ క్షణంగా నిలిచిపోతుంది.
Jersey no. 7 ✅
High IQ stumping by the keeper ✅
Yellow jersey ✅We know what you guys are thinking! 😋#NPLonFanCode pic.twitter.com/cin8ciYYzC
— FanCode (@FanCode) December 16, 2024