AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shoaib Akhtar : అదొక పెద్ద క్రైమ్.. అసమర్థుల చేతిలో పాక్ క్రికెట్ బలి.. అక్తర్ సంచలన వ్యాఖ్యలు

Shoaib Akhtar : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలవ్వడం ఆ దేశంలో పెను దుమారాన్నే రేపుతోంది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో పాక్ కుప్పకూలడాన్ని ఆ దేశ మాజీ దిగ్గజ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.

Shoaib Akhtar : అదొక పెద్ద క్రైమ్.. అసమర్థుల చేతిలో పాక్ క్రికెట్ బలి.. అక్తర్ సంచలన వ్యాఖ్యలు
Shoaib Akhtar
Rakesh
|

Updated on: Feb 16, 2026 | 7:59 AM

Share

Shoaib Akhtar : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలవ్వడం ఆ దేశంలో పెను దుమారాన్నే రేపుతోంది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో పాక్ కుప్పకూలడాన్ని ఆ దేశ మాజీ దిగ్గజ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. లైవ్ టీవీ షోలోనే తన కోపాన్ని ఆపుకోలేకపోయిన అక్తర్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసమర్థులకు పెద్ద పదవులు ఇవ్వడమే ప్రపంచంలోనే అతిపెద్ద నేరమని, అలాంటి నిర్ణయాల వల్లే పాక్ క్రికెట్ నాశనమవుతోందని నిప్పులు చెరిగారు. అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

షోయబ్ అక్తర్ మీడియాతో మాట్లాడుతూ పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ సమర్థతను నేరుగా ప్రశ్నించారు. “బోర్డు చైర్మన్‌గా ఉన్న వ్యక్తికి తను ఏం చేస్తున్నాడో, ఆ పదవికి ఎలా న్యాయం చేయాలో కూడా తెలియదు. అసమర్థుడైన వ్యక్తికి ఒక పెద్ద బాధ్యతను అప్పగించడం కంటే పెద్ద నేరం ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. ఒక తెలివిలేని వ్యక్తికి పగ్గాలు ఇస్తే ఆ సంస్థ మాత్రమే కాదు, దేశం కూడా నాశనమవుతుంది. దానికి నిదర్శనం మీ కళ్ల ముందే ఉంది” అంటూ అక్తర్ ధ్వజమెత్తారు. క్రికెట్ మీద అవగాహన లేని వారు బోర్డులో ఉంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని ఆయన ఎద్దేవా చేశారు.

కేవలం బోర్డునే కాదు, పాక్ జట్టులోని సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్‌లను కూడా అక్తర్ వదిలిపెట్టలేదు. కీలకమైన మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని కూడా అందించలేని వారిని సూపర్ స్టార్లను చేయడం వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. “మీరు ఎవరినైతే స్టార్లను చేశారో, వారు ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేకపోతున్నారు. ఒత్తిడి ఉన్న సమయంలో చేతులెత్తేసే ఆటగాళ్లకు అనవసరంగా మద్దతు ఇస్తున్నారు. ప్రతిభ కంటే కేవలం ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చే ఇలాంటి ఆటగాళ్లను ఎంచుకుంటే ఇలాంటి అవమానాలే ఎదురవుతాయి” అని అక్తర్ ఘాటుగా విమర్శించారు.

ఈ ప్రపంచకప్ కంటే ముందు భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామంటూ మోసిన్ నఖ్వీ పెద్ద ఎత్తున డ్రామాలు చేసిన సంగతి తెలిసిందే. ఐసీసీ బెదిరింపులకు భయపడి చివరి నిమిషంలో మళ్ళీ యూ-టర్న్ తీసుకున్నారు. దీనిపై స్పందిస్తూ.. టీమిండియా ఒక పటిష్టమైన జట్టును నిర్మించుకోవడంలో బిజీగా ఉంటే, పాక్ బోర్డు మాత్రం అనవసరమైన డ్రామాలు, మీడియా పబ్లిసిటీ కోసం పాకులాడిందని అక్తర్ విశ్లేషించారు. క్రికెట్ ఆడుతున్నారా లేక బోర్డు రూమ్ లో రాజకీయాలు చేస్తున్నారా? అని ఆయన మండిపడ్డారు. పనితీరు కంటే మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం వల్లే భారత్ ముందు పాక్ పిల్లిలా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ ఓటమి తర్వాత స్టేడియం బయట ఒక అభిమాని తన టీవీని పగలగొట్టిన వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అక్తర్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆ దేశంలో క్రికెట్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుందని అర్థమవుతోంది. “ఇకనైనా బోర్డులో మార్పులు రాకపోతే పాక్ క్రికెట్ ను కాపాడటం ఎవరి తరం కాదు” అని అక్తర్ తన ప్రసంగాన్ని ముగించారు. మొత్తానికి భారత్ తో ఓటమి పాక్ క్రికెట్ లో అంతర్గత కుమ్ములాటలను మరోసారి బట్టబయలు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..