AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jemimah Rodrigues : మహిళా క్రికెటర్ల పై కాసుల వర్షం.. జెమిమా రోడ్రిగ్స్‌కు బీసీసీఐ బంపర్ ప్రమోషన్!

Jemimah Rodrigues : భారత మహిళా క్రికెటర్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2026 సీజన్‌కు సంబంధించి కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను సిద్ధం చేసింది. ఈసారి కాంట్రాక్ట్ పొందే ఆటగాళ్ల సంఖ్యను 16 నుంచి 21కి పెంచుతూ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా యువ సంచలనం జెమిమా రోడ్రిగ్స్ దశ తిరిగింది.

Jemimah Rodrigues : మహిళా క్రికెటర్ల పై కాసుల వర్షం.. జెమిమా రోడ్రిగ్స్‌కు బీసీసీఐ బంపర్ ప్రమోషన్!
Jemimah Rodrigues
Rakesh
|

Updated on: Feb 07, 2026 | 5:15 PM

Share

Jemimah Rodrigues : భారత మహిళా క్రికెటర్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2026 సీజన్‌కు సంబంధించి కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను సిద్ధం చేసింది. ఈసారి కాంట్రాక్ట్ పొందే ఆటగాళ్ల సంఖ్యను 16 నుంచి 21కి పెంచుతూ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా యువ సంచలనం జెమిమా రోడ్రిగ్స్ దశ తిరిగింది. ఆమె ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ, జెమిమాను ఏ-గ్రేడ్‌లోకి ప్రమోట్ చేస్తూ జీతాన్ని భారీగా పెంచింది. భారత బ్యాటింగ్ వెన్నెముక జెమిమా రోడ్రిగ్స్‌కు బీసీసీఐ ఈసారి పెద్ద పీట వేసింది. గతంలో గ్రేడ్-బీ లో ఉన్న ఆమెను, ఇప్పుడు గ్రేడ్-ఏ కి ప్రమోట్ చేసింది. దీంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మలతో పాటు జెమిమా కూడా ఏడాదికి రూ.50 లక్షల పారితోషికాన్ని అందుకోనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న జెమిమాకు ఇది తగిన గుర్తింపు అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గ్రేడ్-బీ లో షెఫాలీ వర్మ, రిచా ఘోష్‌లతో పాటు స్నేహ్ రాణా ప్రమోషన్ పొంది చోటు సంపాదించుకున్నారు. వీరికి ఏడాదికి రూ.30 లక్షలు లభిస్తాయి.

ఈ ఏడాది కాంట్రాక్ట్ జాబితాలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఏడుగురు కొత్త ఆటగాళ్లకు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. ప్రతికా రావల్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, కాశీ గౌతమ్ వంటి యువ ఆటగాళ్లు గ్రేడ్-సీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ గ్రేడ్‌లో ఉన్న 13 మంది ప్లేయర్లకు ఏడాదికి రూ.10 లక్షల చొప్పున బోర్డు చెల్లిస్తుంది. అయితే సీనియర్ ప్లేయర్ పూజా వస్త్రాకర్, యువ సంచలనం శ్రేయాంక పాటిల్ మాత్రం తమ కాంట్రాక్టులను కోల్పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గాయాల కారణంగా దూరమైన హర్లీన్ డియోల్ మళ్ళీ జాబితాలోకి రావడం విశేషం.

కాంట్రాక్ట్ మనీతో పాటు మ్యాచ్ ఫీజులను కూడా బీసీసీఐ పటిష్టంగా అమలు చేస్తోంది. మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజులు ఇస్తున్న సంగతి తెలిసిందే. టెస్ట్ మ్యాచ్ ఆడితే రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌లకు రూ.3 లక్షల చొప్పున ఒక్కో మ్యాచ్‌కు లభిస్తాయి. ఐపీఎల్ వల్ల ఇప్పటికే ఆర్థికంగా బలోపేతమైన మహిళా క్రికెటర్లకు, ఈ కొత్త కాంట్రాక్టులు మరింత ఊతాన్ని ఇస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

బీసీసీఐ మహిళా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా – 2026

గ్రేడ్ ఏ (రూ. 50 లక్షలు)

అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న నలుగురు సీనియర్ ప్లేయర్లు ఈ కేటగిరీలో ఉన్నారు. జెమిమాకు ఈసారి పదోన్నతి లభించింది.

1. హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్)

2. స్మృతి మంధాన (వైస్ కెప్టెన్)

3. దీప్తి శర్మ

4. జెమిమా రోడ్రిగ్స్ (గ్రేడ్-బి నుంచి ప్రమోషన్)

గ్రేడ్ బి (రూ.30 లక్షలు)

జట్టులో కీలక పాత్ర పోషిస్తున్న నలుగురు ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. స్నేహ్ రాణా గ్రేడ్-సి నుంచి ఇక్కడికి చేరారు.

1. రేణుక సింగ్ ఠాకూర్

2. షెఫాలీ వర్మ

3. రిచా ఘోష్

4. స్నేహ్ రాణా

గ్రేడ్ సి (రూ. 10 లక్షలు)

ఈ జాబితాలో మొత్తం 13 మంది ప్లేయర్లు ఉన్నారు. వీరిలో ఏడుగురు కొత్తగా కాంట్రాక్ట్ దక్కించుకున్న వారు కాగా, హర్లీన్ డియోల్ తిరిగి జట్టులోకి వచ్చారు.

1. రాధా యాదవ్

2. యాస్తికా భాటియా

3. హర్లీన్ డియోల్ (తిరిగి ఎంపికయ్యారు)

4. అమన్‌జోత్ కౌర్

5. అరుంధతి రెడ్డి

6. ఉమా ఛెత్రి

7. ప్రతికా రావల్ (తొలిసారి)

8. క్రాంతి గౌడ్ (తొలిసారి)

9. కాశ్వీ గౌతమ్ (తొలిసారి)

10. శ్రీ చరణి (తొలిసారి)

11. జి. కమలిని (తొలిసారి)

12. వైష్ణవి శర్మ (తొలిసారి)

13. తేజల్ హసబ్నిస్ (తొలిసారి)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us