బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సతీమణి డోనా (46) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం రాత్రి తీవ్రమైన గొంతునొప్పి, దగ్గుతో డోనా తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, దీంతో వెంటనే వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్పించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ విషయాన్ని బుధవారం సాయంత్రం వరకూ కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ‘డోనా గంగూలీకి చికున్ గున్యా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నాం’ అని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్ ఎండీ అండ్ సీఈవో డాక్టర్ రూపాలి బసు తెలిపారు.
కాగా డోనా ఆస్పత్రికి వెళ్లే సమయంలో ఆమె వెంట సౌరవ్ గంగూలీ లేడు. ఆ తర్వాత హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న దాదా వైద్యులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో కనిపించాడని ఓ వార్త సంస్థ పేర్కొంది. కాగా సౌరవ్-డోనాల కూతురు సోనా ప్రస్తుతం లండన్‌లో చదువుకుంటోంది. కాగా డోనా ఒడిశా సంప్రదాయ నృత్యకారిణి. ఆమె ఇప్పటికే చాలా చోట్ల ప్రదర్శనలు కూడా ఇచ్చింది. సౌరవ్, డోనాలు చిన్ననాటి స్నేహితులు. క్రమంగా అది ప్రేమగా చిగురించింది. ఆ తర్వాత పెద్దల ఆశీస్సులతో 1997లో వివాహం చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం సోనా అనే కూతురుంది.
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..