Sanju Samson : 10 ఏళ్ల తర్వాత సాకారం కానున్న స్టార్ క్రికెటర్ కల.. పాకిస్తాన్‌పై తొలి మ్యాచ్
ఆసియా కప్ 2025 కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 9 నుండి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈసారి అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్‌లలో ఒకటి భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14న జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల అధికారిక స్క్వాడ్ ఇంకా ప్రకటించనప్పటికీ, భారత జట్టులో సంజు శాంసన్ ఉండనున్నాడని అంచనా వేస్తున్నారు.

Sanju Samson : ఆసియా కప్ 2025 సమరం మొదలవడానికి రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఆసియా కప్ లో అభిమానులు ఎంతగానో ఎదురుచూసే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈసారి సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో భారత జట్టులో కీలక పాత్ర పోషించబోతున్న ఒక ఆటగాడి పేరు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. దాదాపు పదేళ్ల క్రితం టీ20ల్లో అడుగుపెట్టిన ఆ భారత స్టార్ ఇప్పుడు తన కెరీర్‌లో తొలిసారిగా పాకిస్తాన్‌తో తలపడనున్నాడని వార్తలు వస్తున్నాయి. అతనే కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు సామ్సన్.
సామ్సన్ 2015లో జింబాబ్వేపై తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. అయితే, మొదటి కొన్ని సంవత్సరాలు అతనికి సరైన అవకాశాలు దొరకలేదు. కానీ, గత రెండు, మూడేళ్లుగా సామ్సన్ తన అద్భుతమైన ఫామ్‌తో జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా తన బ్యాటింగ్‌తో, వికెట్ కీపింగ్‌తో సత్తా చాటాడు. ఇప్పుడు ఆసియా కప్ 2025లో అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగవచ్చని తెలుస్తోంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్‌తో అతడి తొలి మ్యాచ్ జరగబోతుండటం విశేషం.
ఈ ఆసియా కప్‌లో టీమ్ ఇండియా ఓపెనింగ్ ద్వయంపై ఆసక్తికరమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన యువ బ్యాటర్ అభిషేక్ శర్మతో కలిసి సామ్సన్ ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నిర్ణయం కనుక ఖరారైతే, ఈ యువ ఓపెనింగ్ జోడీ పాకిస్తాన్ బౌలర్లకు పెద్ద సవాల్ విసిరే అవకాశం ఉంది. సామ్సన్ ఇప్పటివరకు 42 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 861 పరుగులు చేశాడు, ఇందులో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 152.38. ఒక ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా ఒత్తిడిలో ఎలా రాణిస్తాడనేది అభిమానులందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఆసియా కప్ చరిత్రలో భారత్ అత్యంత ఆధిపత్యం ప్రదర్శించిన జట్టుగా నిలిచింది. 1984లో తొలిసారి ఈ టోర్నీని గెలుచుకున్న భారత్, ఇప్పటివరకు అత్యధికంగా 7 సార్లు (1984, 1988, 1990–91, 1995, 2010, 2016, 2018) టైటిల్ సాధించింది. 2016లో టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఏకైక ఆసియా కప్‌ను కూడా భారతే గెలుచుకుంది. ఈ టోర్నీలో శ్రీలంక, పాకిస్తాన్ వంటి బలమైన ప్రత్యర్థులపై భారత దిగ్గజాలు ఎన్నో మరపురాని ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పుడు సామ్సన్ కూడా అదే జాబితాలో చేరి తన ప్రతిభను నిరూపించుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




