Aaron Finch: 11 ఫోర్లు, 14 సిక్సర్లతో మాస్ జాతర.. 63 బంతుల్లో పేలుడు ఇన్నింగ్స్.. దెబ్బకు బౌలర్లు షాక్!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Feb 07, 2023 | 7:14 AM

టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటిస్తూ 12 ఏళ్ల సుదీర్ఘమైన తన క్రికెట్ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టిన ఫించ్.. ఈ నిర్ణయానికి ఇదే సరైన సమయం అని అభివర్ణించాడు.

Aaron Finch: 11 ఫోర్లు, 14 సిక్సర్లతో మాస్ జాతర.. 63 బంతుల్లో పేలుడు ఇన్నింగ్స్.. దెబ్బకు బౌలర్లు షాక్!
Aaron Finch

అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ వీడ్కోలు పలికాడు. టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటిస్తూ 12 ఏళ్ల సుదీర్ఘమైన తన క్రికెట్ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టిన ఫించ్.. ఈ నిర్ణయానికి ఇదే సరైన సమయం అని అభివర్ణించాడు. ఆసీస్‌ జట్టుకు 76 టీ20 మ్యాచ్‌లలో ఫించ్ ప్రాతినిధ్యం వహించాడు. అతడి టీ20 కెరీర్ బెస్ట్ 172 కాగా, ఇంగ్లాండ్‌పై చేసిన 156 పరుగులు మాత్రం ఇప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. మరి లేట్ ఎందుకు ఓసారి ఆ మ్యాచ్‌పై లుక్కేద్దాం పదండి..

2013, ఆగష్టు 29న సౌతాంప్టన్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య రెండు టీ20ల సిరీస్‌లోని తొలి మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీనికి కారణం ఆరోన్ ఫించ్(156) మాస్టర్ క్లాస్ సెంచరీ. ఓపెనర్ డేవిడ్ వార్నర్(1) తొలి ఓవర్‌లోనే పెవిలియన్ చేరినప్పటికీ.. మరో ఎండ్‌లో ఫించ్ విధ్వంసం సృష్టించాడు. మొత్తంగా 63 బంతులు ఎదుర్కున్న ఫించ్ 11 ఫోర్లు, 14 సిక్సర్లతో 156 పరుగులు చేశాడు. అతడికి మార్ష్(28), వాట్సన్(37) చక్కటి సహకారాన్ని అందించడంలో నిర్ణీత ఓవర్లకు ఆసీస్ భారీ స్కోర్ చేయగలిగింది. ఫించ్ దెబ్బకు ఇంగ్లాండ్‌కు చెందిన ఐదుగురు బౌలర్లు ఓవర్‌కు 11కు పైగా పరుగులు సమర్పించారు. జో రూట్ అయితే.. ఒక్క ఓవర్‌లోనే 27 పరుగులు ఇచ్చాడు.

ఇక 249 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భాగంగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత రూట్(90) చక్కటి ఇన్నింగ్స్‌తో అలరించాడు. మరో ఎండ్‌లో బొపారా(45) క్యామియో రోల్ ప్లే చేయడంతో ఇద్దరూ స్కోర్ బోర్డు ముందుకు కదిలించారు. అలాగే బట్లర్(27) ఫర్వాలేదనిపించాడు. ఈ ముగ్గురు మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్లు బ్యాట్‌తో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కాగా, ఫించ్ తన సూపర్బ్ ఇన్నింగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu