Ayush Mhatre : రోహిత్ శర్మ రికార్డు బ్రేక్..అతి చిన్న వయసులో మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన క్రికెటర్
భారత క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త సంచలనం ఉద్భవించింది. ముంబైకి చెందిన 18 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ ఆయుష్ మ్హాత్రే క్రికెట్ చరిత్రలోనే అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో విదర్భపై అద్భుతమైన సెంచరీ సాధించిన తర్వాత, క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో (ఫస్ట్‌క్లాస్, లిస్ట్ A, T20) సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా అతను నిలిచాడు.

Ayush Mhatre : భారత క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త సంచలనం ఉద్భవించింది. ముంబైకి చెందిన 18 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ ఆయుష్ మ్హాత్రే క్రికెట్ చరిత్రలోనే అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో విదర్భపై అద్భుతమైన సెంచరీ సాధించిన తర్వాత, క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో (ఫస్ట్‌క్లాస్, లిస్ట్ A, T20) సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా అతను నిలిచాడు. ఈ క్రమంలో అతను భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న పాత రికార్డును బద్దలు కొట్టడం విశేషం.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో ముంబై తరఫున ఆడిన ఆయుష్ మ్హాత్రే, విదర్భ జట్టుపై అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, ఆయుష్ కేవలం 53 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో నాటౌట్‌గా 110 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతని స్ట్రైక్ రేట్ 207.54గా ఉంది. ఈ ఇన్నింగ్స్ అతని టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ కావడం విశేషం. దీనికి ముందే అతను లిస్ట్ A, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సెంచరీలు సాధించాడు.
ఈ సెంచరీతో ఆయుష్ క్రికెట్ చరిత్రలోనే ఒక కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. అతను క్రికెట్‌లోని మూడు ప్రధాన ఫార్మాట్‌లలో (ఫస్ట్‌క్లాస్, లిస్ట్ A, టీ20) సెంచరీ చేసిన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.ఆయుష్ ఈ ఘనతను 18 సంవత్సరాల 135 రోజుల వయస్సులో సాధించాడు. దీనికి ముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ శర్మ 19 సంవత్సరాల 339 రోజుల వయస్సులో మూడు ఫార్మాట్లలో సెంచరీలు పూర్తి చేశారు.
ఈ జాబితాలో భారత మాజీ ఆటగాడు ఉన్ముక్త్ చంద్ 20 సంవత్సరాల వయస్సుతో మూడవ స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్ 20 సంవత్సరాల 62 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించారు. ఆయుష్ తన చిన్న వయసులోనే అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 13 ఫస్ట్‌క్లాస్, 7 లిస్ట్ A, 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో అతను ఇప్పటివరకు మొత్తం 5 సెంచరీలు సాధించాడు. ఫస్ట్‌క్లాస్‌లో 660 పరుగులు, లిస్ట్ Aలో 458 పరుగులు, టీ20లో 368 పరుగులు చేశాడు. గత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేసిన ఆయుష్, 7 మ్యాచ్‌లలో 240 పరుగులు చేసి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
