AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Helmet History : బైక్ నడిపే వాళ్లను చూసి పుట్టిన ఐడియా.. క్రికెట్ హెల్మెట్ వెనుక షాకింగ్ స్టోరీ

Cricket Helmet History : క్రికెట్ హెల్మెట్ వెనుక ఉన్న ఆసక్తికర కథ వెలుగులోకి వచ్చింది. బైక్ హెల్మెట్‌ను చూసి ప్రేరణ పొందిన డెన్నిస్ అమిస్, క్రికెట్‌లో మొదటి హెల్మెట్‌ను ఉపయోగించి ఆటగాళ్ల భద్రతకు కొత్త దారిని చూపించారు. నేడు ప్రపంచ క్రికెట్‌లో అది విడదీయరాని భాగంగా మారింది.

Cricket Helmet History :  బైక్ నడిపే వాళ్లను చూసి పుట్టిన ఐడియా.. క్రికెట్ హెల్మెట్ వెనుక షాకింగ్ స్టోరీ
Cricket Helmet History
Rakesh
|

Updated on: Jun 20, 2026 | 12:40 PM

Share

Cricket Helmet History : నేటి తరం క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ.. ఇలా ఎవరైనా సరే మైదానంలోకి వస్తే తలకు హెల్మెట్ ఉండటం సర్వసాధారణం. కానీ, ఒకప్పుడు క్రికెట్ ఇంత సురక్షితంగా ఉండేది కాదు. వెస్టిండీస్, ఆస్ట్రేలియా లాంటి జట్లలో ప్రాణాంతకమైన వేగంతో బౌలింగ్ చేసే ఆటగాళ్లు ఉండేవారు. ఆ రోజుల్లో ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా కేవలం సాధారణ టోపీలు పెట్టుకుని బ్యాటర్లు బంతిని ఎదుర్కొనేవారు. దీనివల్ల చాలా మంది ఆటగాళ్లు తలలకు, ముఖాలకు తీవ్రమైన గాయాలపాలై రక్తం చిందించేవారు.

ఈ ప్రమాదకరమైన పరిస్థితిని మార్చడానికి ఇంగ్లాండ్ మాజీ దిగ్గజ బ్యాటర్ డెన్నిస్ అమిస్ ఒక విప్లవాత్మకమైన ఆలోచన చేశారు. క్రికెట్ చరిత్రలోనే హెల్మెట్ ధరించి బ్యాటింగ్ చేసిన మొట్టమొదటి ఆటగాడిగా డెన్నిస్ అమిస్ రికార్డు సృష్టించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్యాకర్ వరల్డ్ సిరీస్ ఆడుతున్న సమయంలో ప్రత్యర్థి జట్లలో గంటకు 90 మైళ్ల (145 కిలోమీటర్ల) కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసే బౌలర్లు ఉన్నారని, వారిని చూసి తనకు తలకు గాయం అవుతుందేమోననే భయం నిరంతరం వేధించేదని గుర్తుచేసుకున్నారు.

తీవ్రమైన ఒత్తిడి ఉన్న ఆ రోజుల్లో ఒకరోజు డెన్నిస్ అమిస్ తన తోటి ఆటగాడు టోనీ గ్రెగ్‌తో కలిసి నడుస్తూ మాట్లాడుతున్నారు. అదే సమయంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న ఒక మోటార్ సైకిల్, దానిపై ఉన్న బైక్ హెల్మెట్ వారి కంటికి పడ్డాయి. ఆ హెల్మెట్‌ను చూడగానే డెన్నిస్ మైండ్‌లో ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. రోడ్డుపై వెళ్లే బైక్ రైడర్ల రక్షణ కోసం హెల్మెట్ ఉన్నప్పుడు.. మైదానంలో అంతకంటే వేగంగా దూసుకొచ్చే క్రికెట్ బంతుల నుంచి బ్యాటర్లను కాపాడటానికి హెల్మెట్ ఎందుకు ఉండకూడదు? అనే ప్రశ్న ఆయన తలకెక్కింది.

అమిస్ వెంటనే ఈ ప్రతిపాదనను అధికారుల ముందు ఉంచారు. ఆ మోటార్ సైకిల్ హెల్మెట్ డిజైన్‌ను కాస్త మార్చి, క్రికెట్ ఆడేందుకు వీలుగా తేలికపాటి బరువుతో ప్రత్యేకమైన సురక్షిత హెల్మెట్‌ను డిజైన్ చేశారు. మొదట్లో కొందరు ఆటగాళ్లు దీన్ని చూసి నవ్వినప్పటికీ, దీనివల్ల కలిగే రక్షణను చూసి క్రమంగా అందరూ వాడటం ప్రారంభించారు. కాలక్రమేణా ఐసీసీ దీన్ని తప్పనిసరి చేయడంతో.. నేడు క్రికెట్ ఆటలో ఇదొక విడదీయరాని భాగమైపోయింది. నాడు ఒక మోటార్ సైకిల్ చూసి పుట్టిన సాధారణ ఆలోచనే నేడు ఎంతోమంది క్రికెటర్ల ప్రాణాలను కాపాడుతోంది.

కేవలం హెల్మెట్ కనిపెట్టడమే కాదు.. ఇంగ్లాండ్ జట్టు తరఫున డెన్నిస్ అమిస్ అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్‌ను సాగించారు. ఆయన ఇంగ్లాండ్ తరఫున 50 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 46.18 సగటుతో 3612 పరుగులు చేశారు. ఇందులో 11 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు 263 నాటౌట్. అలాగే 18 వన్డే మ్యాచ్‌ల్లో 859 పరుగులు సాధించి, అందులో 4 సెంచరీలు నమోదు చేశారు. రికార్డుల పరంగానే కాకుండా.. క్రికెట్ ఆటకు అపారమైన రక్షణను ప్రసాదించిన వ్యక్తిగా చరిత్ర పుటల్లో ఆయన పేరు నిలిచిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us