Arshad Nadeem : ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్‌ను మోసం చేసిన పాక్ ప్రభుత్వం.. ఇచ్చిన ప్లాట్లు మాయం!
పాకిస్తాన్ ఒలింపిక్ జావెలిన్ త్రో స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్, తన విజయం తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో జావెలిన్ విసిరి నీరజ్ చోప్రాను ఓడించి స్వర్ణం సాధించిన నదీమ్‌కు నగదు బహుమతులు అందినప్పటికీ, ప్రకటించిన భూ ప్లాట్ల హామీలు మాత్రం ఉత్తుత్తివేనని ఆయన స్పష్టం చేశారు.

Arshad Nadeem : పారిస్ ఒలింపిక్స్ 2024లో పాకిస్తాన్‌కు స్వర్ణ పతకాన్ని అందించిన ఒలింపిక్ హీరో అర్షద్ నదీమ్, తమ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వర్ణం గెలిచిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని నదీమ్ బహిరంగంగానే విమర్శించారు. ఆయన విజయం దేశవ్యాప్తంగా సంబరాలు నింపినప్పటికీ, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. గత ఆగస్టులో స్టేడ్ డి ఫ్రాన్స్‌లో 92.97 మీటర్ల రికార్డు దూరం జావెలిన్ విసిరి, పాకిస్తాన్‌కు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మొట్టమొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని అందించిన అర్షద్ నదీమ్, ఈ పోటీలో భారత్ స్టార్ నీరజ్ చోప్రా (రజతం)ను ఓడించి చరిత్ర సృష్టించాడు. అతని విజయం తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు భారీ నగదు బహుమతులు, భూ ప్లాట్‌లతో సహా అనేక రివార్డులను ప్రకటించాయి.
అయితే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అర్షద్ నదీమ్ మాట్లాడుతూ.. తనకు ప్రకటించిన అన్ని నగదు బహుమతులు అందినప్పటికీ, ప్రభుత్వం ఇస్తామన్న ప్లాట్ల హామీలు మాత్రం ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయని వెల్లడించాడు. “నాకు ప్రకటించిన బహుమతులలో అన్ని ప్లాట్ హామీలు అబద్ధమే, అవి నాకు అందలేదు. అవి కాకుండా ప్రకటించిన అన్ని నగదు బహుమతులు నాకు వచ్చాయి” అని ఆయన తెలిపారు. ఒక సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నదీమ్ నిరాశను ఎంతోమంది అర్థం చేసుకున్నారు. పంజాబ్‌లోని మియాన్ చన్ను అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన నదీమ్ సాధారణ కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి ఒక నిర్మాణ కార్మికుడు, ఇప్పటికీ కుటుంబానికి ప్రధాన సంపాదనదారు. కష్టపడి ప్రాక్టీస్ చేసి, దేశానికి బంగారు పతకం సాధించిన క్రీడాకారుడికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం అర్షద్ నదీమ్ రాబోయే టోర్నమెంట్‌లపై దృష్టి సారించాడు. ఈ సెప్టెంబర్‌లో టోక్యోలో జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ కోసం ఆయన ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. “నా దృష్టి అంతా నా మీదనే ఉంది, అది కాకుండా, మా వద్ద ట్రైనింగ్ కోసం వచ్చే ఏ యువకుడికైనా మేము ట్రైనింగ్ ఇస్తాము, ఈ ట్రైనింగ్ నా కోచ్ సల్మాన్ బట్ ఇస్తాడు” అని ఆయన చెప్పుకొచ్చాడు. టోక్యో ఛాంపియన్‌షిప్‌కు ముందు ఆగస్టు 16న పోలాండ్‌లోని సిలేసియాలో జరిగే డైమండ్ లీగ్ మీట్‌లో అర్షద్ నదీమ్- నీరజ్ చోప్రా పోటీకి మరో అధ్యాయం తెర లేవనుంది. ఈ ఇద్దరు దిగ్గజ జావెలిన్ త్రోయర్‌ల మధ్య పోరును చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




