Deepika Kumari: భారత స్టార్‌ ఆర్చర్‌ సంచలన నిర్ణయం.. తల్లైన 20 రోజులకే విల్లు పట్టిన దీపిక.. కారణమేంటంటే?

సాధారణంగా ఇలాంటి సమయంలో ఇంటిపట్టునే ఉండి బిడ్డ ఆలనాపాలనా చూసుకోవాలి. అయితే ఆటపై నిబద్ధత, ప్రేమ చాటుకుంటూ తల్లైన 20 రోజులకే విల్లు పట్టుకుని మైదానంలో అడుగుపెట్టింది దీపిక. కోల్‌కతాలో జరుగుతున్న జాతీయ సీనియర్‌ ఓపెన్‌ ట్రయల్స్‌లో పాల్గొంటోంది.

Deepika Kumari: భారత స్టార్‌ ఆర్చర్‌ సంచలన నిర్ణయం.. తల్లైన 20 రోజులకే విల్లు పట్టిన దీపిక.. కారణమేంటంటే?
Archer Deepika Kumari

Updated on: Jan 12, 2023 | 4:21 PM

సరిగ్గా నెల రోజుల క్రితం భారత స్టార్‌ ఆర్చర్ దీపికా కుమారి తల్లిగా ప్రమోషన్‌ పొందింది. తన భర్త అటానుదాస్‌తో కలిసి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సాధారణంగా ఇలాంటి సమయంలో ఇంటిపట్టునే ఉండి బిడ్డ ఆలనాపాలనా చూసుకోవాలి. అయితే ఆటపై నిబద్ధత, ప్రేమ చాటుకుంటూ తల్లైన 20 రోజులకే విల్లు పట్టుకుని మైదానంలో అడుగుపెట్టింది దీపిక. కోల్‌కతాలో జరుగుతున్న జాతీయ సీనియర్‌ ఓపెన్‌ ట్రయల్స్‌లో పాల్గొంటోంది. 3సార్లు ఒలింపిక్స్ లో పాల్గొన్న దీపిక గత ఏడాది జరిగిన ప్రపంచ కప్, ఆసియా క్రీడల ట్రయల్స్‌లో విఫలమైంది. దీనికి తోడు కోల్ కతాలో జరిగే ట్రయల్స్ లో పాల్గొనకపోతే ఈ ఏడాదంతా జట్టుకు దూరం కావాల్సి ఉంటుంది. ఇది 2024లో జరిగే ప్యారిస్ ఒలింపిక్స్‌పై పడుతుంది. అందుకే బాలింతగానే ఈ ట్రయల్స్‌కు హాజరైంది. ‘ గర్భం ధరించినప్పటికీ సుమారు ఏడవ నెల వరకు నేను ప్రాక్టీస్‌ చేస్తూనే ఉన్నాను. అయితే ఆతర్వాత కొన్ని ఇబ్బందులెదురయ్యాయి. అందుకే ప్రాక్టీస్‌ పూర్తిగా మానేశాను. అదృష్టవశాత్తూ నాకు సాధారణ డెలివరీనే జరిగింది. కాబట్టి 20 రోజుల వ్యవధిలోనే ట్రయల్స్‌కు హాజరయ్యారు. గత మూడు నెలలుగా ఉన్న గ్యాప్‌ను ఇప్పుడు భర్తీ చేయాలి’ అని చెప్పుకొచ్చింది దీపిక.

అయితే బిడ్డను వదిలిపెట్టి ఉండడం అంత తేలికకాదంటూ ఎమోషనలవుతోంది స్టార్‌ ఆర్చర్‌. ‘ ఇంట్లో బిడ్డను వదిలిపెట్టి రావడం అంత ఈజీ కాదు. మొదటి రోజైతే కన్నీళ్లొచ్చాయి. ఇంటి నుంచి భారంగా బయటకు వచ్చాను. ఎందుకంటే నా బిడ్డ తల్లిపాలు మాత్రమే తాగుతుంది. ప్రస్తుతం నేను కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నా. అయితే త్వరలోనే అన్నీ సర్దుకుంటాయనిపిస్తోంది. మా అత్తామామాలు ఇంటి దగ్గరే ఉండి అమ్మాయి ఆలనాపాలనా చూసుకుంటున్నారు. ఇక ప్రాక్టీస్‌లో 44 పౌండ్లు (సుమారు 20 కేజీల) విల్లును ఉపయోగిస్తున్నాను. ఇది మరింత కష్టంగా ఉంది’ అని చెబుతోంది దీపిక. కాగా మొదటి ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్‌లో కటాఫ్ మార్క్ అయిన టాప్-16లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా బరిలోకి దిగింది దీపిక.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..