పేరు ఉచ్ఛారణలో పొరపాటు… ఇద్దరు టీమిండియా క్రికెటర్లకు క్షమాపణలు చెప్పిన గిల్‌క్రిస్ట్..
పేరు ఉచ్ఛారణలో పొరపాటు కారణంగా ఇద్దరు టీమిండియా క్రికెటర్లకు ఆసిస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ క్షమాపణలు కోరాడు. పొరపాటు జరిగింది క్షమించండి అంటూ ట్వీట్ చేశాడు.
పేరు ఉచ్ఛారణలో పొరపాటు కారణంగా ఇద్దరు టీమిండియా క్రికెటర్లకు ఆసిస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ క్షమాపణలు కోరాడు. పొరపాటు జరిగింది క్షమించండి అంటూ ట్వీట్ చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. టీమిండియా ఆటగాడు మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ ఇటీవల కన్నమూసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సిరాజ్ ఆస్ట్రేలియా టూర్‌లో ఉండటంతో తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయాడు. దీంతో సిరాజ్‌కు సానుభూతి ప్రకటించాలని తలంచిన గిల్‌క్రిస్ట్ చిన్న పొరపాటు చేశాడు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం నాడు భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా గిల్‌క్రిస్ట్ వ్యవహరించారు. సిరాజ్ తండ్రి మృతి విషయం తెలుసుకున్న గిల్‌క్రిస్ట్.. మ్యాచ్ ప్రారంభం సందర్భంగా ఆ విషయాన్ని ప్రస్తావించాడు. అయితే సిరాజ్ పేరుకు బదులుగా నవదీప్ సైనీ పేరును ప్రస్తావించి పొరపాటు చేశాడు. తండ్రి చనిపోయిన నేపథ్యంలో నవదీప్ సైనీ ఇంటికి వెళ్లేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చినా.. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అతను వెళ్లలేదంటూ గిల్‌క్రిస్ట్ కొనియాడు. అయితే చనిపోయింది సిరాజ్ తండ్రి కావడంతో గిల్‌క్రిస్ట్ చేసిన పొరపాటును గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో పలువురు ఆయనను ట్యాగ్ చేశారు. దీనికి వెంటనే స్పందించిన గిల్‌క్రిస్ట్… ‘పొరపాటు చేశాను.. నా పొరపాటుకు మన్నించండి’ అంటూ టీమిండియా ప్లేయర్లు మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీలకు క్షమాపణలు చెప్పాడు. అలాగే తన పొరపాటు గుర్తించి తనకు తెలియజేసిన వారికి గిల్‌క్రిస్ట్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశాడు.