Mumbai Bomb Blasts: ముంబై పేలుళ్లపై రా మాజీ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు.. ఆ దేశాన్ని నమ్మి నిండా మోసపోయామంటూ..

|

Mar 11, 2023 | 4:11 PM

మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల (Mumbai Bomb Blasts) ఘటన యావత్‌ దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. 1993 మార్చి 12న ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. భారత్‌పై జరిగిన అతిపెద్ద అలాగే మొదటి ఉగ్రవాద దాడి ఇదే.

Mumbai Bomb Blasts: ముంబై పేలుళ్లపై రా మాజీ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు.. ఆ దేశాన్ని నమ్మి నిండా మోసపోయామంటూ..
Former R&aw Chief Vikram Sood
Follow us on

మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల (Mumbai Bomb Blasts) ఘటన యావత్‌ దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. 1993 మార్చి 12న ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. భారత్‌పై జరిగిన అతిపెద్ద అలాగే మొదటి ఉగ్రవాద దాడి ఇదే. ఈ వరుస బాంబు పేలుళ్లలో 257 మందికిపైగా సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే వందలాది మంది గాయాలపాలయ్యారు. అండర్‌ వరల్డ్‌ మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, ఛోటా షకీల్‌ తదితర మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల ప్రయేయంలోనే ఈ వరుస బాంబు పేలుళ్లు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. బాంబు పేలుళ్ల సంగతి పక్కన పెడితే దీని తర్వాత దేశంలో చెలరేగిన అల్లర్లు శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగించాయి. భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసేలా జరిగిన ఈ దుర్ఘటనకు ఆదివారం (మార్చి 12)తో 30 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా అప్పటి రా (రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్) చీఫ్‌ విక్రమ్‌ సూద్‌ ముంబై వరుస పేలుళ్ల, అప్పటి భయానక పరిస్థితుల గురించి న్యూస్‌ 9తో షేర్‌ చేసుకున్నారు.

బాబ్రీ మసీదు విధ్వంసానికి ముందే ప్రణాళికలు..

1993 ముంబై పేలుళ్లకు రెండు నెలల ముందు అంటే జనవరిలో ముంబైలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం కారణంగా ఈ అల్లర్లు చెలరేగాయి. చాలామంది బాబ్రీ మసీదు విధ్వంసం, ఆతర్వాత జరిగిన అల్లర్లకు ప్రతీకారంగానే ముంబై పేలుళ్లు జరిగాయని భావించారు. అయితే ఇందులో వాస్తవం లేదంటున్నారు రా మాజీ చీఫ్‌ విక్రమ్‌ సూద్‌. ‘ ముంబై అల్లర్లు జరిగిన రెండు నెలలకే మార్చి 93 దాడి జరిగింది. చాలామంది ఈ రెండు సంఘటనలను సరిపోల్చుతూ చూస్తారు. అయితే అంతకన్నా ముందే ముంబై పేలుళ్లకు ప్రణాళికలు రచించారు. ఎందుకంటే ఇంత భారీమొత్తం ఆర్డీఎక్స్‌, లాజిస్టిక్స్‌ సమకూర్చుకోవాలంటే రెండు నెలల సమయం ఏ మాత్రం సరిపోదు. మెటీరియల్‌ని సేకరించడానికి, నిల్వ చేయడానికి, దానిని సక్రమంగా ఉపయోగించేలా శిక్షణ పొందేందుకు అవసరమైన మానవశక్తిని పొందడానికి చాలా సమయం పడుతుంది. ఇదంతా జరగాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. ఇక ISI అనేది RAW లేదా MI6 వంటి సాధారణ గూఢచార సంస్థ లాంటిది కాదు. వారి ప్రణాళికలకు ప్రభుత్వం అనుమతి కూడా అవసరం లేదు. 1993 ముంబై వరుస పేలుళ్లు భారతదేశంపై జరిగిన అతిపెద్ద మొదటి ఉగ్రవాద దాడి. అంతకుముందు మేం ఎప్పుడూ ఇలాంటి విస్పోటనాలు చూడలేదు. ఇందులో పాకిస్తాన్‌ ముద్ర ఉందని స్పష్టంగా తేలింది. అప్పుడు లభించిన పాస్‌పోర్ట్‌లు, వీసాల్లో పాకిస్తాన్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించాయి. అలాగే పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ (POF) గుర్తులను కలిగి ఉన్న డిటోనేటర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే మేం దానిని క్రాస్ చెక్ చేయడానికి అమెరికన్లకు ఇచ్చి తప్పుచేశాం. వారు పాక్‌ పాత్ర బయటపడకూడదని సాక్ష్యాలను మొత్తం ధ్వంసం చేశారు. మేం తిరిగి డిటోనేటర్‌ను తిరిగి అడిగినప్పుడు పొరపాటున పగిలిపోయిందని అబద్ధాలాడారు’

దావూద్‌ అక్కడే ఉన్నాడు..

‘1990వ దశకంలో, నవాజ్ షరీఫ్, బెనజీర్ భుట్టో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పదవులను మార్చుకునే వారు. అయితే అసలు విషయం ఏమిటంటే పాకిస్థాన్‌ను సైన్యం పాలిస్తోంది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. ఆఫ్ఘన్ ముజాహిదీన్‌తో పోరాడటానికి అమెరికన్లకు పాకిస్తాన్ సహాయం చేసింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుండి సోవియట్ యూనియన్‌ను వదిలించుకుంది. ఇలా అమెరికా, పాక్‌ల మధ్య పరస్పర ప్రయోజనాలున్నాయి. దావూద్‌ ఇబ్రహీం ఇప్పటికీ పాకిస్తాన్‌లోనే ఉన్నాడు. కానీ ఈ విషయాన్ని పాక్‌ అంగీకరించదు. అంతేకాదు బాలాకోట్‌, పుల్వామా దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు కూడా పాక్‌లోనే తలదాచుకున్నారు. 1993 తర్వాత 2008లో మళ్లీ ముంబైపై ఉగ్రవాద దాడి జరిగింది. అంతుకుముందు 2001 పార్లమెంటుపై దాడి జరిగింది. ఇలా భారత భూభాగంపై జరిగిన ఉగ్రవాద దాడులన్నింటిలోనూ పాక్‌ ప్రమేయం ఉంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు విక్రమ్‌ సూద్‌.

ఇవి కూడా చదవండి