హిందూ మతంలో త్రయోదశి తిథి లయకారుడైన శివునికి అంకితం చేసినట్లే.. ప్రతి ఏకాదశి తిథి ఉపవాసం కూడా సృష్టి పోషకుడైన విష్ణువుకు అంకితం చేయబడింది. ఏకాదశి రోజున ఉపవాసం చేపట్టి శ్రీ మహా విష్ణువును పూజించడం ద్వారా శ్రీ హరి విశేష అనుగ్రహం లభిస్తుంది. ప్రతి నెలా రెండుసార్లు ఏకాదశి వ్రతం పాటిస్తారు. కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథిలో మొదటిది.. శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిలో రెండవది. ప్రతి మాసపు ఏకాదశి వ్రతానికి వేర్వేరు పేరు .. విభిన్న ప్రాముఖ్యత ఉంది. అటువంటి పరిస్థితిలో జేష్ఠ మాసంలో అంటే జూలై నెలలో ఏకాదశి ఉపవాసం ఎప్పుడు ఆచరించాలి పూజా సమయం, శుభ ముహర్తం తదితర వివరాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
యోగినీ ఏకాదశి ఉపవాసం నిర్జల ఏకాదశి తర్వాత .. దేవశయని ఏకాదశి అంటే తొలి ఏకాదశికి ముందు ఆచరిస్తారు. తెలుగు వారి క్యాలెండర్ ప్రకారం జేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి రోజున యోగిని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఈ ఏడాది జూలై 2న యోగినీ ఏకాదశి వచ్చింది. ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా తెలిసి తెలియక చేసే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని జీవితంలో ఆనందం, శ్రేయస్సును కలిగి ఉంటాడని నమ్మకం.
జేష్ఠ మాసం కృష్ణ పక్ష ఏకాదశి తేదీ ప్రారంభం – 1 జూలై 2024 ఉదయం 10:26 నుండి.
కృష్ణ పక్ష ఏకాదశి తిథి ముగింపు – జూలై 2 ఉదయం 8:42 గంటలకు
యోగిని ఏకాదశి ఉపవాస తేదీ – 2 జూలై 2024 మంగళవారం.
యోగినీ ఏకాదశి వ్రతం యువకులు లేదా పెద్దలు ఎవరైనా ఆచరించవచ్చు. ఎవరైనా వ్యాధి లేదా ఆరోగ్య సమస్యల నుంచి బయట పడాలనుకుంటే ఈ ఏకాదశి పూజ విశేష ఫలితాలను ఇస్తుంది. కుష్టు వ్యాధితో సహా ఏవైనా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ ఉపవాసం పాటించడం వలన ఫలితాలు లభిస్తుందని విశ్వాసం. అనేక ఇతర ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే ఈ వ్రతం కూడా చాలా ప్రతిఫలదాయకం, అన్ని గత జన్మ పాపాలను, చెడు పనుల వలన కలిగే దోషాలను తొలగిస్తుంది. మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున దేవశయని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. దేవశయని ఏకాదశి రోజు నుంచి విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లాడని విశ్వాసం. అందుకే దీనిని దేవశయని ఏకాదశి అంటారు. శ్రీ హరి దేవశయని ఏకాదశి రోజు నుండి నాలుగు నెలల పాటు నిద్రలో ఉంటారు. అనంతరం దేవుత్తని ఏకాదశి రోజున విష్ణువు మేల్కొంటాడు. ఈ సంవత్సరం దేవశయని ఏకాదశి 17 జూలై 2024 న జరుపుకోనున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.