Shivaratri Fasting: ఈ 5 కేటగిరీల వారు పండుగ రోజున ఉపవాసానికి దూరంగా ఉండటమే బెటర్…
శివయ్య అనుగ్రహం కోసం చేసే ఉపవాసం మీ శరీరానికి భారంగా మారకూడదు. శివరాత్రి రోజున రోజంతా ఏమీ తినకుండా ఉండటం వల్ల పుణ్యం వస్తుందని అందరూ నమ్ముతారు, కానీ అందరి శరీర తత్వం ఒకేలా ఉండదు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు నిర్లక్ష్యంగా ఉపవాసం ఉంటే అది ఇతర సమస్యలకు దారితీస్తుంది. అసలు శివరాత్రి వ్రతం ఎవరికి నిషిద్ధమో, వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

ఉపవాసం అంటే దైవ చింతనతో పాటు ఆరోగ్య నియమాలను పాటించడం. కానీ, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు లేదా గర్భిణీలు కఠినమైన ఉపవాస దీక్షలు పట్టడం అస్సలు మంచిది కాదు. భక్తి ఎంత ఉన్నా, శరీరం సహకరించని పక్షంలో దైవం కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోమనే చెబుతుంది. శివరాత్రి నాడు ఉపవాసం ఉండకూడని వ్యక్తుల జాబితా మరియు దానికి గల కారణాలు మీకోసం..
వీరు ఉపవాసానికి దూరంగా ఉండటమే మేలు!
మధుమేహ వ్యాధిగ్రస్తులు : ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పడిపోయి (Hypoglycemia) కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
గర్భిణీ స్త్రీలు : తల్లితో పాటు గర్భంలోని శిశువుకు నిరంతరం పోషకాలు అందాలి. ఉపవాసం వల్ల వచ్చే నీరసం పిండం అభివృద్ధిపై ప్రభావం చూపవచ్చు.
చిన్నపిల్లలు, వృద్ధులు: వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. రోజంతా ఆహారం లేకపోతే డీహైడ్రేషన్ తీవ్రమైన శారీరక బలహీనతకు లోనవుతారు.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు: కిడ్నీ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా నీరు, మందులు తీసుకోవాలి. ఉపవాసం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతిని కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది.
గ్యాస్ట్రిక్ సమస్యలు : ఖాళీ కడుపుతో ఉండటం వల్ల కడుపులో యాసిడ్ల ఉత్పత్తి పెరిగి అల్సర్లు తీవ్రమవుతాయి. దీనివల్ల తీవ్రమైన కడుపు మంట, వాంతులు వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని జాగ్రత్తలు..
ఏదైనా శస్త్రచికిత్స జరిగిన వారు లేదా దీర్ఘకాలికంగా మందులు వాడుతున్న వారు ఉపవాసం అస్సలు చేయకూడదు. అలాగే, పాలిచ్చే తల్లులు ఉపవాసం ఉండటం వల్ల వారిలో పాల ఉత్పత్తి తగ్గి శిశువుకు ఇబ్బంది కలగవచ్చు. భక్తితో పాటు విజ్ఞతను ఉపయోగించి నిర్ణయం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఒకవేళ మీరు ఉపవాసం ఉండాలనుకుంటే..
శరీరం పూర్తిగా సహకరించకపోయినా భక్తితో ఉండాలనుకునే వారు ‘ఫలాహారం’ (పండ్లు, పాలు) తీసుకుంటూ ఉపవాసం ఉండవచ్చు. పూర్తిగా నీరు కూడా తాగకుండా ఉండే ‘నిర్జల ఉపవాసం’ కేవలం పూర్తి ఆరోగ్యవంతులకు మాత్రమే సూచించదగినది. నీరు ఎక్కువగా తాగుతూ, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ముఖ్యం.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే ముందు డాక్టరును సంప్రదించండి.
