పిల్లల చదువుకు శుభారంభం.. వసంత పంచమి అక్షరాభ్యాస ముహూర్తం ఇదే!

Vasant Panchami 2026: వసంత పంచమిని ఈ ఏడాది జనవరి 23న శుక్రవారం రోజున జరుపుకుంటున్నాం. ఏడాదిలో అత్యంత శుభదినాల్లో వసంత పంచమి ఒకటి. అందుకే మాఘ మాస శుక్ల పక్ష పంచమి తిథిన జరుపుకునే ఈ పర్వదినం.. చిన్నారుల జీవితంలో తొలి విద్యారంభానికి అత్యంత శుభకరంగా భావిస్తారు.

పిల్లల చదువుకు శుభారంభం.. వసంత పంచమి అక్షరాభ్యాస ముహూర్తం ఇదే!
Vasant Panchami

Updated on: Jan 22, 2026 | 10:11 AM

హిందూ ధర్మంలో వసంత పంచమికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ శక్తివంతమైనరోజున విద్యకు, వాక్కుకు, కళలకు అధిష్టాన దేవత, జ్ఞానస్వరూపిణి అయిన సరస్వతీ అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. సకల విద్యాప్రదాయని, జ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతీ అమ్మవారు మాఘ శుక్ల పంచమి నాడు ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. వసంత పంచమిని ఈసారి జనవరి 23న శుక్రవారం రోజున జరుపుకుంటున్నాం. ఏడాదిలో అత్యంత శుభదినాల్లో వసంత పంచమి ఒకటి. అందుకే మాఘ మాస శుక్ల పక్ష పంచమి తిథిన జరుపుకునే ఈ పర్వదినం.. చిన్నారుల జీవితంలో తొలి విద్యారంభానికి అత్యంత శుభకరంగా భావిస్తారు.

వసంత పంచమి ప్రాముఖ్యత

మాఘ మాస శుక్ల పక్ష పంచమి తిథిన జరుపుకునే వసంత పంచమి రోజున ప్రకృతి అంతా నూతన ఉత్సాహంతో కళకళలాడుతుంది. ఇదే రోజున సరస్వతి దేవి అవతరించిందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ పర్వదినాన్ని విద్యారంభానికి శ్రేష్ఠమైన దినంగా భావిస్తారు. ఈరోజున సర్వస్వతీ అమ్మవారి ఆలయాల్లోనే కాకుండా నివాసాలు, విద్యాలయాల్లోనూ చదువుల తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అక్షరాభ్యాసానికి ఎందుకు ఈ రోజు శుభం?

వసంత పంచమి రోజున చేసే కార్యాలకు పంచాంగ దోషాలు ఉండవని శాస్త్రాలు చెబుతున్నాయి. పిల్లలు చదువులో రాణించేందుకు ఈరోజు అక్షరాభ్యాసం చేయిస్తారు. సంగీత, కళా శిక్షణ ప్రారంభం చేయడం వల్ల చిన్నారులకు జ్ఞానం, బుద్ధి, వాక్చాతుర్యం లభిస్తాయని నమ్మకం. చాలా విద్యాలయాల్లో సరస్వతీ పూజలు చేయడంతోపాటు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి.. పెన్నులు, పలకలు, పుస్తకాలు పంచిపెడతారు. ఈరోజు ఈ విధంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.

అక్షరాభ్యాస శుభ ముహూర్తం

వసంత పంచమి రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అక్షరాభ్యాసానికి అనుకూల సమయమేనని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా: ఉదయ కాలం. అభిజిత్ లగ్నం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రోజును సర్వసిద్ధి ముహూర్తంగా కూడా పేర్కొంటారు.

అక్షరాభ్యాస విధానం

అక్షరాభ్యాసానికి ముందు సరస్వతి దేవికి ప్రత్యేక పూజ నిర్వహించాలి. పసుపు వస్త్రాలు, అక్షింతలు ఉపయోగించి చిన్నారి చేత బియ్యం లేదా పలకపై మొదటి అక్షరాలు రాయిస్తారు. సాధారణంగా “ఓం శ్రీం సరస్వత్యై నమః” లేదా ఓం లేదా ‘అ ఆ ఇ ఈ’తో విద్యారంభం చేస్తారు. వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయడం చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమేనని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. సరస్వతి దేవి కృపతో విద్యాభ్యాసం సాఫీగా సాగాలని కోరుకునే వారు ఈ శుభదినాన్ని తప్పక వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

పంచమి రోజున పూజ, నైవేద్యం ఏమివ్వాలి?

వసంత పంచమి రోజున బ్రహ్మీముహూర్తంలో నిద్రలేచి శుచిగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. సరస్వతీ అమ్మవారిని ప్రత్యేకంగా పూజించాలి. పంచమి రోజున అక్షరాభ్యాసానికి ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శుభముహూర్తం ఉందని పండితులు చెబుతున్నారు. పంచమి రోజున ఏ పని మొదలుపెట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుందని చెబుతున్నారు. వసంత పంచమి రోజున సరస్వతి దేవికి పాయసం, చక్కెర పొంగలి, పసుపు రంగు మిఠాయిలు, నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ.